పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బొగ్గుబావిలోకి దిగిన ఓ కార్మికుడు అదృశ్యమయ్యాడు. ఈ విషాద ఘటన 11 ఇంక్లైన్ బొగ్గుబావిలో చోటుచేసుకుంది. మంగళవారం విధుల్లో భాగంగా బొగ్గుబావిలోకి దిగిన కార్మికుడి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.

సింగరేణిలో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ మంగళవారం ఒక్కటో డిప్ వద్ద పంపులను రన్ చేయడానికి వెళ్లి తిరిగి పైకి రాలేదు. దీంతో రాత్రంతా గని లోపల కార్మికుల సాయం తో సింగరేణి అధికారులు గాలించినా అతడి ఆచూకి మాత్రం దొరకలేదు. 

దీంతో సింగరేణి అధికారులు రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపారు. గని లోపల పూర్తిస్థాయిలో గాలించేందుకు చర్యల్ని ముమ్మరం చేశారు. సంజీవ్ ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో అతడి కుటుంబసభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమయ్యింది. అతడు గనిలోనే ఎక్కడైనా చిక్కుకున్నాడా లేక ఏదయినా ప్రమాదానికి గురయి మరణించాడా అన్న అనుమానాలను తోటి కార్మికులు వ్యక్తం చేస్తున్నారు.