తెలంగాణలో ఆర్టిసి కార్మికుల చేపడుతున్న సమ్మెలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరీంనగర్ ఆర్టిసి డిపె వద్ద  నిరసన చేపడుతున్న కార్మికుల్లో జంపన్న అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సహచరులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. 

ఒక్కసారిగా జంపన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడే వున్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఇప్పటికే పలువురు ప్రాణాలను కోల్పోయారు. ఇటీవలే మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుకు లోనయ్యాడు. సమ్మెలో భాగంగా సోమవారం మంచిర్యాల బస్ డిపో ఎదుట కార్మికులు, వారి కుటుంబసభ్యులు బైఠాయించి దీక్షకు దిగారు.  

బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఈ దీక్షకు మద్ధతు పలికాయి. ఈ సమయంలో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ నాయకులతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ తోపులాటలో ఆర్టీసీ డ్రైవర్‌ వీఎస్ఎన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆయన అక్కడిక్కడే కుప్పుకూలారు. తోటి కార్మికులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  

Read more RTC strike: గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్..పరిస్థితి విషమం...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.గత 15 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆయన పాల్గొన్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే ఆవేదనతో ఆయన చనిపోయారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఖాజామియా మృతిపట్ల తెలంగాణ ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం ఉద్యోగం లేక సొంతింటికి చేసిన అప్పు తీరుతుందో లేదోననే మనస్తాపంతో హైదరాబాద్ 49M రూట్ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సురేందర్ గౌడ్ హైదరాబాద్ రాణి గంజ్ ఆర్టీసీ డిపో టూ లో పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని కార్వాన్ లోని ఇంట్లో  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రాంచందర్ రావు లు సందర్శించారు. 

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ముందు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే కండక్టర్ బ్లేడుతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘‘చలో ప్రగతి భవన్’’ ఉద్రిక్తంగా మారింది. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, విక్రమ్ గౌడ్, రాములు నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఆదివారం సాయంత్రం నుంచే జిల్లాల్లో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.