తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులు సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. తెలంగాణ ప్రభుత్వం- ఆర్టీసి ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమవడంతో శుక్రవారం అర్థరాత్రి నుండే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కూడా బస్సులన్ని నిలిచిపపోవడంతో ప్రజారవాణ స్తంభించింది. 
 
ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవకుండా వుండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా బస్సులను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు.ఈ నేపథ్యంలోనే అర్హత, ఆసక్తి కలిగినవారు సంబంధిత డిపోలో సంప్రదించాలని ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. 

దీంతో కరీంనగర్ డిపో పరిధిలో తాత్కాలిక ఉద్యోగాల కోసం యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారుల సూచన మేరకు తమ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకొని తాత్కాలిక రిక్రూట్ మెంట్ కోసం డిపో వద్దకు చేరుకుంటున్నారు. వీరికి రోజువారి వేతనంగా రూ.1000, రూ.1500 చొప్పున చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆర్టీసి యాజమాన్యం ప్రకటించింది. 

ఇక శాశ్వత ఉద్యోగుల సమ్మెతో బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. తాత్కాలిక  ఉద్యోగులతో కేవలం ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు నడిపిస్తుతున్నారు. కొన్నిచోట్ల ఇలా నడుస్తున్న బస్సులపై కూడా దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్యోగులు డిపోల ఎదుట ధర్నాలు చేపడుతూ బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. 

సంబంధిత వీడియో వార్త

ఆర్టీసి తాత్కాలిక ఉద్యోగాలపై యువత ఆసక్తి....(వీడియో)