కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పదమూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంథని ఆర్టిసి కార్మికులు అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించడంతో పాటు రోడ్డుపైనే ధూమ్ దాం కార్యక్రమాన్ని ఏర్నాటుచేశారు. 

గురువారం మంథని డిపో నుండి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ర్యాలీగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ సాంస్కృతిక  పాటలు పాడుతూ ధూమ్ దాం కార్యక్రమాలను నిర్వహించారు.

ఇక గురువారం ఉదయం నుండే జిల్లాకు చెందిన వివిధ డిపోల ఆర్టీసి కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆర్టిసి సమ్మెకు మద్దతుగా లెఫ్ట్ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

హుజూరాబాద్ లో 13 వ కొనసాగుతున్న అర్‌టిసి కార్మికుల నిరసనలు, స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధూమ్ దాం కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాలు అర్‌టిసి కార్మికులకు మద్దతు తెలిపారు. 

సిరిసిల్ల పట్టణంలో ఆర్టీసి కార్మికుల రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ దీక్షకు తాజాగా వామపక్ష పార్టీల నుండి మద్దతు లభించింది. సమ్మెకు సంఘీభావంగా వారుకూడా ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఇక్కడ కార్మికుల రిలే దీక్ష  ఎనిమిదవ రోజులకు చేరుకుంది. 

వీణవంక మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఇలా  ఉమ్మడి  కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.