పెద్దపల్లి జిల్లా ధర్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయం పేటలో నిబంధనలకు వ్యతిరేకంగా గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ ఆర్మీ ఉద్యోగి ని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి  ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మీడియాతో  మాట్లాడారు. 

శాయంపేట గ్రామంలో జనవరి 1వ తేదీన మాజీ ఆర్మీ ఉద్యోగి బద్దం తిరుమల్ రెడ్డి డబుల్ బ్యారెల్ గన్ తో  గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ ఆ వీడియో సోషల్ మీడియాలో రావడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు పెద్దపల్లి ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. పెద్దపల్లి సీఐ మరియు ధర్మారం ఎస్ఐలు తమ సిబ్బందితో క్షేత్రస్థాయి విచారణ జరిపి కాల్పులు జరిగినట్లు నిర్ధారించుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేయడం జరిగిందని డిసిపి తెలిపారు.

శాయంపేటలో కాల్పులు: రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిరుమల్ రెడ్డి అరెస్ట్

 అతని వద్ద గన్ ఎక్కడిది అని విచారణ జరపగా 2002 నుండి 2019 వరకు ఆర్మీలో విధులు నిర్వహించి గత సంవత్సరంలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అయితే ఆర్మీలో పనిచేసే సమయంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం నుండి డబుల్ బ్యారల్ (బిబిఎల్) తుపాకీ మరియు 20 రౌండ్స్ అనుమతి పొందడం జరిగిందన్నారు.   

రిటైర్మెంట్ తర్వాత తిరుమల్ రెడ్డి సొంత గ్రామం శాయంపేటలోనే  నివాసం వుంటున్నాడు. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తుపాకిని తన వద్ద ఉంచుకోవడం నేరమని డిసిపి తెలిపారు. అంతేకాకుండా తుపాకీని ఉపయోగించి ప్రజల ను భయబ్రాంతులకు గురి చేసిన తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు తుపాకీ, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 

అతడు కాల్పులు జరపడానికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశామని... త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు డిసిపి రవీందర్ . ఈ సమావేశంలో పెద్దపల్లి  ఏసీపీ హబీబ్ ఖాన్, పెద్దపల్లి  సీఐ ప్రదీప్ కుమార్, ధర్మారం ఎస్సై ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.