కరీంనగర్: ప్రజల భద్రత కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకుసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న ఈ కమీషనరేట్ పోలీసులు మరో అడుగు ముందుకు వేసి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణీకుల భద్రత, రక్షణ సౌకర్యార్ధం ప్యాసింజర్ వెహికిల్ డిజిటలైజన్ విధానాన్ని శుక్రవారం(నేటినుండి ) ప్రారంభించారు. ప్రయాణీకులను చేరవేసే ఆటోలు వంటి వాహనాలకు డిజిటల్‌ బోర్డు, క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్ కోడ్) ను డాటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. 

ప్రయాణీకులను చేరవేసే ప్రతి ప్రైవేటు వాహనానికి యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ బోర్డును అమర్చారు. సాధారణ ఫోన్ తో పాటు స్మార్ట్ ఫోన్ కలిగిన వారందరూ ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కలిగిన వారు క్యూఆర్ స్కానర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. వాహనానికి అమర్చిన డిజిటల్‌ బోర్డ్ , క్యూఆర్ కోడు స్కాన్ చేసుకున్న వెంటనే వాహనం, వాహనదారుడికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి వస్తాయి. 

ప్రయాణీకులకు ఎన్నెన్నో సౌకర్యాలు 

ఇందులో ఎమర్జెన్సీ కాల్ , ఎమర్జెన్సీ టెక్స్ట్ , కంప్లైంట్ , రేటింగ్ అంశాలు ఉంటాయి. ఎమర్జెన్సీ కాల్ చేయగానే కమాండ్ కంట్రోల్‌కు సమాచారం చేరుతుంది. ఎమర్జెన్సీ టెక్ట్స్ చేయగానే కమాండ్ కంట్రోల్ తోపాటు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం అందుతుంది. కంప్లైంట్ ( ఫిర్యాదు ) చేయగానే వాహనంలో ఏవైనా వస్తువులు మరచిపోయిన సందర్భంలో సదరు వాహనానికి సంబంధించిన డ్రైవర్ వివరాలు మెసేజ్ రూపంలో అందడంతో పాటు కమాండ్ కంట్రోలు కూడా సమాచారం అందుతుంది. 

read more  దోపిడీ కేసు: 35 ఏళ్ల తర్వాత నిందితుడి పట్టివేత

సాధారణ ఫోన్ వినియోగదారులు కూడా వాహనం బోర్డుపై ఉన్న నెంబర్‌కు మెసేజ్ ( ఎస్ఎంఎస్ ) చేస్తే సంబంధిత పోలీసులకు ప్రయాణీకుడి వాహనానికి సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.  కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,117 ప్రైవేటు వాహనదారులు ఈ సౌకర్యం కోసం వాహనాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది. 

కమీషనరేట్ వ్యాప్తంగా శరవేగంగా రిజిస్ట్రేషన్ల పర్వం కొనసాగుతున్నది. సేఫ్ సిటిలో భాగంగా ప్రయాణీకుల భద్రత , రక్షణ కోసం ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పైన పేర్కొన్న డిజిటల్ బోర్డు , క్యూఆర్ కోడ్ లు టీఎస్ కాప్ యాప్ లను అనుసంధానం చేయబడింది. దీంతో ప్రయాణీకులు ఉన్న లొకేషన్ షేర్ అవుతుంది.

రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు ఐడి కార్డులను అందజేస్తారు. క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ను వాహనం బయట అద్దానికి , డ్రైవర్ సీటుకు వెనుక, వాహనం వెనుకభాగంలో అమర్చబడి ఉంటుంది . ప్రజల రక్షణ , భద్రత కోసం వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తూ సఫలీకృతం అవుతున్న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకరావడం ఆహ్వానించదగిన పరిణామమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.