కరీంనగర్: జగిత్యాల పట్టణం అనేక సమస్యలు ను ఎదుర్కొంటోందని... ఇదంతా గత పాలకుల నిర్వాకమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించినా కనీస అభివృద్దికి కూడా నోచుకోలేకపోయిందన్నారు. మచ్చుకైనా ఒకటి చేశారు అని చెప్పుకోవడానికి లేదన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఎన్నో సంవత్సరాల కల అయిన ప్రత్యేక జిల్లాను సాకారంచేసిందని మంత్రి గుర్తుచేశారు. 

 అర్బన్ డెవలప్మెంట్ కోసం డైరెక్ట్ గా బడ్జెట్ లో మునిసిపాలిటీ ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని మంత్రి అన్నారు. దానిలో భాగంగానే జగిత్యాల మునిసిపాలిటీకి రూ.50కోట్ల నిధులను మంజూరు చేసామన్నారు. 

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా జగిత్యాలను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో అబద్ధాలు చెప్పి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీ అయినప్పటి నుండి పత్తా లేకుండా పోయాడని విమర్శించారు. గతంలో కల్వకుంట కవిత ఎంపీగా ఉన్నప్పుడు నెలకు మూడు, నాలుగు సార్లు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ చూసేవారని గుర్తుచేశారు. 

జేఎన్టీయూ కాలేజ్ ఏర్పాటు చేశామని  గొప్పలు చెప్పుకునే వారు ఇక్కడి ప్రజలు ఏమంటున్నారో ఓసారి తెలుసుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడో మూలన ఈ కాలేజీ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రయోజనం లేకుండా చేశారని ఇక్కడి పాలకులు, ప్రజలే పదే పదే చెబుతున్నారని మంత్రి అన్నారు.

read more  వేములవాడ ఆలయానికి వెళితే మంత్రి పదవి ఊడుతుందా...!: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

జగిత్యాలలోని 48 స్థానాలకు 10 స్థానాల్లో పోటీ చేయడానికి  అభ్యర్థులు లేని బిజెపి ప్రగల్బాలు పలకడం విడ్డూరంగా వుందన్నారు. పసుపు బోర్డు గురించి అడిగితే ఎంపీ అరవింద్ తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు. 

బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధి కేవలం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం... కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటేయాలని మంత్రి కొప్పుల సూచించారు. 

 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ... జగిత్యాల మునిసిపాలిటీ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కానీ ఈ సారి మాత్రం గులాబీ జెండా ఎగరవేయలని ముందుకు సాగుతున్నామన్నారు. ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం తప్ప పని చేసే వారు కాదని అన్నారు. 

read more  ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు

ఎంపీగా గెలిచి 9 నెలలు గడిచినా  అభివృద్ధి గురించి పని చేయకపోగా ఈ పని చేస్తా అని కూడా ప్రకటించలేకపోయాడని అరవింద్ పై విమర్శలు గుప్పించాడు. కాంగ్రెస్ కుటుంబ పాలన సాగిన 40 సంవత్సరాలలో జగిత్యాల అస్తవ్యస్తం  అయ్యిందన్నారు. టీఆర్ఎస్ ఖచ్చితంగా 48 వార్డులో గెలిచి తీరుతామన్నారు.