మానవత్వాన్ని చాటుకున్న మంచిర్యాల పోలీసులు... మహిళ ప్రాణాలను కాపాడి
ఓ మహిళా పేషంట్ ను కాపాడి మంచిర్యాల పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.
కరీంనగర్: కరోనా వైరస్ నివారణ వ్యాప్తి లో భాగంగా లాక్ డౌన్ సందర్బంగా పోలీసులు ఒకవైపు నిరంతరం డ్యూటీ నిర్వర్తిస్తూనే మరోవైపు ఆనాథలు, వలస కూలీలకు, వికలాంగులకు, నిరుపేద ప్రజలకు భోజనాలు, వసతి, నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ మానవత్వం చాటుకుంటున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు ఓ మహిళా పేషంట్ ను కాపాడారు. స్టేషన్ పరిధిలోని గంగిపల్లి అనే గ్రామంలో తీవ్రమైన జ్వరంతో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమృత అనే మహిళను కాపాడారు.
జ్వరంతో మహిళను ఆసుపత్రికి తరలించడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో వారు జైపూర్ ఎస్సై విజేందర్ కి ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై అత్యవసర పరిస్థితుల్లో ప్రజల కోసం ఏర్పాటుచేసిన వాహనాన్ని వెంటనే సిబ్బందితో కలిసి గంగిపల్లి కి పంపించారు. ఆ మహిళను త్వరితగతిన మంచిర్యాల ఆస్పత్రికి తరలించడం జరిగింది.
ఫోన్ చేయగానే వెంటనే స్పందించిన జైపూర్ పోలీసులకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో యావత్ పోలీస్ వ్యవస్థను ప్రశంసిస్తున్నారు.