కరీంనగర్: అతడు పురుషుడు... అయినా చీర కట్టుకుని అచ్చం మహిళగా ముస్తాబవుతాడు. అంతటితో ఆగకుండా కాలనీలోని వారిని కూడా మహిళగానే నమ్మించి  మహిళలతో చనువుగా మెలగడం ప్రారంభించాడు. ఇలా ఆడవేషంలో వున్న మగరాయుడి బండారం తాజాగా బయటపడి స్థానికుల చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ కు చెందిన దాదాపు 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి గత కొంత కాలంగా చీర, జాకెట్ ధరించి కాలనీలోని మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇటీవలే హౌజింగ్ బోర్డు కాలనీలో ఒంటరి మహిళను అంటూ ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అతడి వ్యవహారశైలిపై స్థానికులకు అనుమానం వచ్చింది.  దీంతో అతని నడవడిక, కదలికలపై నిఘా వేసిన స్థానికులు అతను మహిళ కాదని, ఆడవేషంలో ఉన్న పురుషుడేనని గ్రహించారు. 

దీంతో ఇవాళ స్థానికులు అతన్ని బయటకు లాగి చెట్టుకు కట్టేసి మరీ దేహశుద్ధి చేశారు. అయితే అతడు మహిళా వేషధారణలో ఎందుకు తిరుగుతున్నాడన్నది తెలుసుకోలేకపోయారు.  

అతడు ఒకప్పుడు కరీంనగర్ పట్టణంలో ఆటో నడిపిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అయితే ఇతను హిజ్రా కూడా కాదంటున్నారు. ఏదైనా నేరం చేసి మారువేషంలో  తిరుగుతున్నాడా? లేక చేయడానికి ఈ వేషం ఎంచుకున్నాడా? అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళా పురుషుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు.