కరీంనగర్: భూతగాదాల నేపథ్యంలో సొంత సోదరులపైనే ఓ వ్యక్తి కత్తులతో దాడిచేశాడు. ఈ దారుణ  సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో చోటుచేసుకుంది.ఈ  దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హుజురాబాద్ లోని కిందివాడకు చెందిన శ్రీపతి సారయ్య, బాబురావు , రమేష్ లు అన్నా తమ్ముళ్లు. వీరి మధ్య గత కొన్నాళ్ళుగా భూతగాదాలు జరుగుతున్నాయి. 

గీత కార్మికులైన ఈ అన్నదమ్ములు మంగళవారం ఉదయం కులవృత్తిలో భాగంగా కల్లు గీయడానికి వెళ్లారు. ఈ సమయంలో మరోసారి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో అన్నలు సారయ్య, బాబురావులతో పాటు అన్న కొడుకుపై కూడా తమ్ముడు రమేష్ కల్లుగీయడానికి ఉపయోగించే కత్తితో దాడి చేశాడు.   

తీవ్రంగా కక్తమోడుతున్న వారిని స్థానికులు, కుటుంబసభ్యులు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా వుండటంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు రమేష్ పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో వున్నట్లు  తెలిపారు. అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.