జగిత్యాల: తెలిసీ తెలియని వయసులో ఆ  యువతి  ప్రేమలో పడింది. అయితే ఈ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లి మనసును పంచుకున్నవాడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంది. కానీ ఆ సైకో ప్రియుడు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. అలాగని వేరేవాళ్లతో కూడా యువతి పెళ్లి చేసుకోకుండా అడ్డుకున్నారు. దీంతో అటు  ప్రియుడి సైకో చేష్టలను తట్టుకోలేక... ఇటు తల్లిదండ్రుల బాధను చూడలేన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను వదిలింది. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  

జిల్లాలోని సారంగపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) ఇంటర్మీడియట్ చదవే సమయంలో అదే గ్రామానికి చెందిన తన క్లాస్ మేట్ రంజిత్(19) ని ప్రేమించింది. కాలేజీ రోజుల్లో ఇద్దరి ప్రేమ సాఫీగా సాగింది. కానీ ఆ తర్వాతే ప్రియుడు రంజిత్ అసలు రూపం బయటపడింది. 

ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉమ ఇంటివద్దే వుంటోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఆమె తన ప్రేమ విషయం వారికి చెప్పి పెళ్లికి  ఒప్పిచింది. కులాలు వేరయినప్పటికి ఇద్దరికి పెళ్లి చేయాలని ఉమ తల్లిదండ్రులు భావిస్తే రంజిత్ మాత్రం పెళ్లికి ససేమిరా అన్నారు. అలాగని ఉమకు వేరే పెళ్లి చేయడానికి అంగీకరించబోనంటూ సైకోలా ప్రవర్తించాడు.

read more   కరోనా తెచ్చిన కష్టాలు.. నరకం చూస్తున్న మహిళలు

ఈ క్రమంలోనే ఉమకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతూ రాక్షసానందం పొందడం ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలి... లేదంటే చచ్చిపోవాలి అంటూ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రియుడి వేధింపులు తట్టుకోలేక, తల్లిదండ్రులను మరింత బాధ పెట్టకూడదని ఉమ  దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసిపెట్టి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.  

ఇంటికి వచ్చేసరికి కూతురు అపస్మారక స్థితిలో వుండటంతో తల్లిదండ్రులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉమ బుధవారం మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు రంజిత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.