జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ ప్రేమకు అడ్డురాని కులం పెళ్లికి మాత్రం అడ్డువస్తుందని... అలాగని పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోడానికి సాహసించిన ప్రేమజంట ప్రాణాలను తీసుకోడానికి మాత్రం ధైర్యం చేశారు. ఇలా కలిసి బ్రతకలేమని భావించిన ప్రేమజంట కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. 

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రణిత్, అదే గ్రామానికి చెందిన గుండేటి రమ్య కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో పెద్దలకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఇదే క్రమంలో ప్రేమ పెళ్లి చేసుకోలేక, పెద్దలకు విషయాన్ని చెప్పలేక మదనపడిపోయిన యువతి, యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. 

read more  ప్రియుడితో ఎఫైర్: నారాయణఖేడ్‌లో భర్తను చంపిన భార్య

సోమవారం రాత్రి 7గంటల సమయంలో గ్రామ శివారులోని చెట్టు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ప్రణిత్ చెట్టుకు ఉరేసుకొని చనిపోగా, భయంతో రమ్య ఇంటికి వెళ్లిపోయింది. అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న యువతి రాత్రి 3గంటల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా చనిపోయింది. గ్రామంలో యువతి యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.