ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కరీంనగర్ లో సిపిఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సిపిఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ముందు సిపిఐ నాయకులందరూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. సమ్మె చేస్తే తొలగిస్తామని బెదిరించడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

 ఈ కార్మికులు తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు.  ఉద్యోగులను కాపాడడం కోసం తెలంగాణలో పోరాటం మొదలైందన్న కేసీఆర్ మాటలను సిపిఐ జిల్లా కార్యదర్శి గుర్తుచేశారు.   
 
 కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయంలో మంత్రి పీఏకు ఆర్టీసీ జేఏసీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.  ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

 కార్మికుల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ అధికారులు తప్పుడు నివేదిక ఆధారంగా ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో మాదిరిగానే తమ హక్కులకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆర్టీసీ కార్మికులు తెలిపారు.