Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పోరులో కరీంనగర్ జయభేరి: అసలేం జరిగింది?

కరోనా వైరస్ మీద పోరులు కరీంనగర్ దాదాపుగా విజయం సాధించింది. కరోనా వైరస్ కట్టడికి కరీంనగర్ పోలీసులు అనుసరించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. చాలా ముందుగా అప్రమత్తమై చర్యలు తీసుకోవడమే ఫలితాన్నిచ్చింది.

Karimanagr will be a role model to fight against Coronavirus
Author
Karimnagar, First Published Apr 25, 2020, 6:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తున్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారిపై దేశాన్ని అప్రమత్తం చేశారు కరీంనగర్ ఖాకీలు. పసివాడి దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు అందరినీ కబళిస్తున్న కరోనా లింకును గుర్తించి దేశానికే దిక్సూచిలా మారారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా కరోనా జడలు విప్పుకుంటుందన్న విషయాన్ని అధికార యంత్రాంగం తెలపడంతో ఎక్కడికక్కడ కట్టడి చేయగలిగారు. లేదంటే కరోనా ఉపద్రవంతో యావత్ భారతావని మరింత అతలాకుతలం అయ్యేదనీ, కరీంనగర్ మరో ఇటలీలా మారేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడిలోనూ కరీంనగర్ ఆదర్శంగా నిలుస్తోందనీ, ఈ జిల్లానే ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఉన్నతాధికారులు చెప్తున్నారు. కంటైన్‌మెంటు జోన్లు ఏర్పాటు చేసి కరోనా కట్టడికి కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఎలా కృషి చేసిందో అలా చేయండి అన్న విషయాలే ఇప్పుడు పలువురి నోట వినిపిస్తున్నాయి. ఇండోనేషియా మత ప్రచారకులను గుర్తించి కరీంనగర్ ప్రజలను సురక్షితంగా ఉంచిన ఘనత కూడా కరీంనగర్ పోలీసులదే..

అసలేం జరిగింది?

మార్చి 14న న్యూ ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో ఇండోనేషియా వాసులు బయలుదేరారు. 15న పెద్దపల్లిజిల్లా రామగుండం స్టేషన్‌లో దిగిన వీరు ఓ ఆటోలో కరీంనగర్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు వీరి పూర్తి వివరాలను స్పెషల్ బ్రాంచ్‌లో రిపోర్ట్ చేశారు. వారు ఫలనా ప్రార్థన మందిరంలో ఉన్నారని సమాచారం అందించారు. అప్పటికే కరోనా చైనాలో విజృంబిస్తున్న తీరు గమనించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారిని పిలిపించుకుని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

మెడికల్ చెకప్..

కరోనా మరణ మృదంగం మోగుతున్నందున మెడికల్ చెకప్ చేయించుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఇండోనేషియా వాసులకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సూచించారు. అప్పటికీ కరోనా విషయంలో అలర్ట్ కావాలనంటూ ఎలాంటి ఆదేశాలు లేకున్నా ఇక్కడి పోలీసులు చొరవ తీసుకుని మెడికల్ సర్టిఫికెట్
తేవాలన్నారు. అయితే, ఇండోనేషియావాసులు ఓ ప్రైవేటు ల్యాబ్ నుంచి పరీక్షలు చేయించుకున్న రిపోర్ట్ ఎస్బీ అధికారులకు ఇచ్చారు. ఆ మత ప్రచారకుల్లో ఒకరు అప్పటికే జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించడంతోపాటు అనధికారికంగా ఇచ్చిన ఆ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోబోమనీ, గవర్నమెంట్ ఆస్పత్రి పరీక్షలు చేయించుకుని ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించాలని తేల్చచెప్పారు. దీంతో ఇండోనేషియా వాసులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా వారిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వారి నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలడంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేయడం, వారు బస చేసిన ప్రార్థనా మందిరానికి వెళ్లిన వారిని క్వారంటైన్ చేయడం వల్లే కరీంనగర్‌లో కరోనా కట్టడి సాధ్యమైంది.

దేశాన్నే అప్రమత్తం చేశారు..

స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తం కాకుంటే కరీంనగర్ మరో ఇటలీనీ మరిపించేదేమో.స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టకుని లోతుగా చేసిన అధ్యయనం దేశాన్నే అప్రమత్తం చేసింది. ఇండోనేషియా వాసులు ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడికెళ్లారు.. ఏం చేశారు అన్న విషయాలు తెలుసుకుని దేశాన్నే అప్రమత్తం చేశారు. ఇండోనేషియా వాసులు ముందుగా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు హాజరై కరీంనగర్‌కు వచ్చారని‌ తెలుసుకున్నారు. ఆ ప్రార్థనలను వేలాది మంది భారతీయులు, విదేశీయులు కూడా వచ్చారని తెలుసుకున్నారు. ఈ సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్పోలీసులు కమిషనర్‌కు రిపోర్ట్ చేశారు. సీపీ కమలాసన్ రెడ్డి వెంటనే ఈ నివేదికను డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర హోంశాఖకు పంపించారు. అప్పుడు రంగంలోకి దిగిన ఐబీ పూర్తి వివరాలను కేంద్రానికి సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో మర్కజ్ ప్రార్థనలనుగుర్తించి క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

ఖాకీల డేగ కళ్ల పరిశీలన..

కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసింది. లేనట్టయితే దేశంలో లక్షలాది మంది కరోనా వ్యాధి బారిన పడేవారు. కరీంనగర్ పోలీసులు ఇండోనేషియా వాసులను పూర్తిగా విచారించనట్టయితే మర్కజ్ ప్రేయర్స్ గురించే వెలుగులోకి రాకపోయేది.

వాస్తవంగా విదేశీయులు భారత్‌లో పర్యటించినట్టయితే ఢిల్లీ నుంచి వారి వివరాలతో కూడిన నివేదికను సంబందిత జిల్లాలకు పంపించాలి. ఈ డిటైల్స్ అన్ని కూడా స్పెషల్ బ్రాంచ్ ఎఫ్ సెక్షన్‌కు రాగానే సంబంధిత జిల్లాల నిఘా వర్గాలు విదేశీయుల గురించి ఆరా తీసి వారి కదలికలను గమనించే అవకాశం ఉంటుంది. కానీ, కరీంనగర్ పోలీసులకు ఇలాంటి సమాచారం రాకున్నా ఇండోనేషియా మత ప్రచారకుల గురించి తెలుసుకుని అప్రమత్తం చేయడం వారి డేగ కళ్ల పరిశీలనకు అద్దం పడుతోంది. అలాగే ఇండోనేషియా వాసులను విచారించాలన్న ఆలోచనే రాకుంటే దేశంలోని ఎన్నో రాష్ట్రాలు మహారాష్ట్రను మరిపించేవి. ఇప్పుడు విదేశాల్లో శవాలు గుట్టలుగా ఏర్పడడం గురించి మనం ఎలా వింటున్నామో భారత్ గురించి ప్రపంచం అంతా అలా వినాల్సి వచ్చేదన్నది పచ్చి నిజం.

డీజీపీ అభినందన..

కరోనా మహమ్మారి గురించి కరీంనగర్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి ‘‘కరీంనగర్ పోలీసులను వెల్‌డన్… గుడ్ జాబ్’’ అంటూ అభినందించారు. లాక్‌డౌన్‌లో కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్న పోలీసులను, ముఖ్యంగాకరీంనగర్ పోలీసుల ముందుచూపును ప్రజలు ముందుగా అభినందించాలి మరి.

Follow Us:
Download App:
  • android
  • ios