కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కొత్తగా నాలుగు కరోనా వైరస్ అనుమానితులను గుర్తించారు. జిల్లాలోని మానకొండూరు మండలం ముంజంపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని క్వారంటైన్ కు తరలించారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి భార్య స్వస్థలం ముంజంపల్లి. గత నెల 19వ తేదీన ఆమె ముంజంపల్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో శనివారంనాడు కేవలం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఆరు కేసులు, వరంగల్ లో ఒక కేసు బయటపడ్డాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తెలంగాణలో 990కి చేరుకుంది. తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మరణించారు.

భారతదేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకీ కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 26,496కు చేరుకుంది. మరణాల సంఖ్య 824కు చేరింది.

ఇప్పటి వరకు 5,803 మంది చికిత్స పొంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19,868 ఉంది. జార్ఖండ్ లో తాజాగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66కు చేరుకుంది.

గత 24 గంటల్లో 1,990 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు రికార్డు కావడం ఇదే. మహారాష్ట్రలో 7628 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2096 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కేసుల సంఖ్య 1821 ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1793 కేసులు నమోదయ్యాయి.