కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంబడిపల్లికి చెందిన రైతు జీల కనకయ్య భూసమస్యను పరిష్కరించడం లేదని తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్‌ పోశారు. రైతును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

జీల కనకయ్య అనే రైతు చాలా కాలంగా తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ చిగురుమామిడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టుగా రైతు చెప్పాడు. తన భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రెవిన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టుగా తెలిపారు.

అయితే ఈ భూ వివాదం విషయంలో  సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని రెవిన్యూ అధికారులు చెప్పారు. అయితే  ఈ కారణంగానే ఈ భూమి పట్టా చేయలేదని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.

also read:pattikonda mro: విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త

రెవిన్యూ కార్యాలయాల్లో పనులు జరగడం లేదని ప్రజలు పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి  ఈ నెల 4వ తేదీన పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. 

విజయారెడ్డి సజీవ దహనమైన తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కూడ మృతి చెందాడు.ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కూడ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ కూడ మృతి చెందాడు. 

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత ఇదే తరహలో పనుల కోసం రెవిన్యూ అధికారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పత్తికొండ ఎమ్మార్వో ఏకంగా తన చాంబర్‌లో తాడు కట్టి తాడుకు అవతలి వైపున ఉండే ఫిర్యాదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తాడుకు ఇవతలికి రాకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు  తహసీల్దార్ కార్యాలయాల్లో రెవిన్యూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు గాను  పీఆర్‌ఓ్లను నియమించాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది..త్వరలోనే రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడ పీఆర్ఓలను ప్రభుత్వం నియమించనుంది.

తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇటీవల చోటు చేసుకొంటున్న ఘటనలతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళనతో కూడ ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకొని రెవిన్యూ అధికారులు విధులు నిర్వహించారు.