పెంచిన టికెట్ల ధరలను తక్షణమే తగ్గించాలని తినుబండారాల రేట్లను ఎంఆర్పి కంటే అధికంగా అమ్ముతున్న థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్థానిక మమత టాకీస్ ముందు మంగళవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన టికెట్ల ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

టికెట్ల రేట్లను 50 రూపాయల నుండి వంద రూపాయల వరకు అమ్ముతున్నా థియేటర్ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన ప్రశ్నించారు. దర్శకులు, నిర్మాతలు సినిమాల పైన పెట్టుబడి అధికంగా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదారి పట్టిస్తున్నారని తిరుపతి ఎద్దేవా చేశారు. 

టికెట్ల రేట్లను థియేటర్ యాజమాన్యాలకు పెంచే అవకాశం కల్పిస్తున్నపుడు పెట్టిన పెట్టుబడి కంటే పది శాతం ఆశించి మిగతా డబ్బులు ప్రభుత్వానికీ ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుల దగ్గర ఎందుకు తీసుకోవడడం లేదని మండిపడ్డారు. థియేటర్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా టికెట్ రేట్లు పెంచుతూ అభిమానులు, సామాన్య ప్రజల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్న థియేటర్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి టికెట్ల రేట్లను, తినుబండారాల రేట్లను తగ్గించి థియేటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. థియేటర్లలో తనిఖీలు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న థియేటర్ యాజమాన్యంపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టికెట్ల రేట్లను తగ్గించాలని  సినీ హీరోల అభిమానులు, మేధావులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి నరేష్ పటేల్, నాయకులు నాగవత్ శ్రీనివాస్, సంతోష్  కిషన్, లింగ నాయక్, రాజు, రవి, సంపత్, శ్రీనివాస్, వినోద్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వీడియో

టికెట్ రేట్లు పెంచడంపై డివైఎఫ్ మండిపాటు (వీడియో)...