కరీంనగర్ లో నిరసన దీక్షలో ఉన్న బండి సంజయ్ ను బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 
బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారన్నారు.

క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని బెదిరిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారన్నారు. 

అల్లున్ని ముందు పెట్టి కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు  కేంద్రం మీద ఏడవడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు,మంత్రి హరీష్ కు అబద్ధాల విషయంలో  డాక్టరేట్లు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. 

కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ గెలుపు ఖాయం అని అన్నారు.