కరోనా కట్టడికి తానుసైతం... రూ.50 లక్షలు కేటాయించిన బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కరోనా కట్టడి కోసం ఎంపీల్యాడ్ప్ నిధుల నుండి రూ.50లక్షలను ప్రభుత్వానికి అందించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు స్థానిక ఎంపీ,రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలను ఈ వైరస్ నియంత్రణ చర్యలకు ఉపయోగించాలంటూ జిల్లా కలెక్టర్ కు చెక్కును అందించారు ఎంపీ బండి సంజయ్.
వేగంగా వ్యాప్తిచెందుతున్న అతి ప్రమాదకరమైన కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, జిల్లా అధికారులు చేస్తున్న సేవలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ నిధులను అందించినట్టు తెలిపారు. ఈ నిధులను వైరస్ కట్టడికి వినియోగం చేయాలని కోరారు.
కరోనా ప్రమాదకర రీతిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహకరించాలని ఎంపీ కోరారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ అధికారులకు, సిబ్బంది కి సహకరించాలని సంజయ్ జిల్లా ప్రజలకు విన్నవించారు.
''ఉగాది సందర్భంగా మన కోసం శ్రమిస్తున్న సిబ్బందికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ శర్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అదే విధంగా మన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటివంటి వైద్య, పారిశుద్ధ్య, పోలీస్, రెవెన్యూ, ఇతర సిబ్బందికి, వారి కుటుంబాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుందాం.
ఉగాది సందర్భంగా ఎవరూ సరుకుల కోసమని మార్కెట్ కు వెళ్లే ప్రయత్నం చేయవద్దు. ఇంట్లో అందుబాటులో ఉన్న సరుకులతోనే ఈ ఉగాదిని జరుపుకోవాలి.తద్వారా కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం, కరోనాను తరిమికొడదాం.లాక్డౌన్ కారణంగా పండుగ జరుపుకోలేని స్థితిలో ఉన్న పేద వారికి తమ వంతు సహకారం అందించాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను'' అంటూ బండి సంజయ్ కుమార్ పేరిట ఓ ప్రకటన విడుదలయ్యింది.