కరీంనగర్ జిల్లా: భారతీయ జనతా పార్టీ చేపట్టిన  గాంధీ సంకల్ప యాత్ర కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో పాదయాత్రకు సిద్దమైన బిజెపి  ఎంపీ  బండి సంజయ్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని బిజెపి శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను ఓవైపు పొగుడుతూ మరోవైపు గాంధీజీ పేరును రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని బిజెపి ఆరోపిస్తోంది. ఈ  నేపథ్యంలోనే  కరీంనగర్ లో బిజెపి చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రను  అడ్డుకుంది. ఈ యాత్రను చేపట్టే హక్కు బిజెపికి లేదంటూ కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పాదయాత్రను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

దీంతో ఆగ్రహించిన బిజెపి కార్యకర్తలు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను  అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బిజెపి యాత్రను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు ముందుగానే ప్రకటించినా వారిని  పోలీసులు అడ్డుకోలేకపోయారని ఎంపీ ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం వల్లే తన యాత్రను అడ్డుకున్నారని ఎంపీ ఆరోపించారు. ఈ విషయమై స్థానిక ఎస్సైతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

Read more చిరుతిళ్లకు రూ.25 లక్షల ప్రజాధనం ఖర్చు... స్పందించిన లోకేశ్...

తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ పార్లమెంట్ సభ్యుడు శాంతియుతంగా గాంధీ సంకల్పయాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోకుండా చూడాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఈ యాత్రను అడ్డుకోవడంలో టీఆర్ఎస్ పాత్ర కూడా వుందని ఎంపీ ఆరోపించారు.

ఈ సందర్భంగా  బండి సంజయ్ పోలీసులకు గట్టిగా హెచ్చరించారు. తమ పాదయాత్రకు పోలీసు బందోబస్తు ఇకపై అవసరం లేదని నిరాకరించారు. ఈ యాత్రను ఎలా కొనసాగించాలో తమకు తెలుసని  బండి సంజయ్ అన్నారు.

కర్నూలు నగరంలో కూడా ఇలాగే నిన్న (మంగళవారం)  బిజెపి చేపడుతున్న గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకునేందుకు విద్యార్థి,యువజన సంఘాల నేతలు ప్రయత్నించారు. కర్నూల్ కు హైకోర్టును తరలించాలన్న డిమాండ్ కు బిజెపి మద్దతు కోరుతూ వారు ఈ నిరసన చేపట్టారు.

Read more కర్నూల్ లో ఉద్రిక్తత...హైకోర్టు కోసం విద్యార్థి,యువజన సంఘాల ఆందోళన...

బిజెపి నాయకులు బసచేసిన మౌర్య ఇన్ హోటల్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థి,యువజన సంఘాలు ప్రయత్నించాయి. అయితే ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులుకు విద్యార్థి నేతలకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. బీజేపీ నేత బయటికి రావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళన చేశారు. ఇందుకు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిచర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేదంటే రాష్ట్రంలో బిజెపి చేపట్టే అన్ని కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.