జగిత్యాల: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి శనిలా దాపురించాడని... కేంద్రం రాష్ట్ర అభివృద్దికి సహకరించడానికి సిద్దంగా వున్నా ఈయనే అడ్డుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. చెరుకు రైతులకు ఉపయోగపడే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి అడ్డు తగులుతున్నాడని ఆరోపించారు. 
 
''సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మన సంస్కృతి పెంచాల్సిన బాధ్యత ఉంది.  పసుపు రైతుల కోసం ముందుగా మద్దతు ధర రూ.9000 తీసుకొచ్చాము. సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్యంగా మిర్చి మరియు పసుపు కోసమే తీసుకొచ్చాము. వచ్చే పంట వచ్చే సరికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తాం'' అని అన్నారు. 

''పసుపు రైతులు ఇప్పటికే సగానికి పైగా పంట అమ్మేసుకున్నారు. తక్కువ ధరకు అమ్ముకున్న వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే కనీస గిట్టుబాటు ధర కల్పిస్తే సంతోషం. గిట్టుబాటు  ధరపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే సహకరిస్తుంది'' అని సూచించారు. 

''తెలంగాణ రాక ముందు కేసీఆర్ ఎలా ఉండేవారు వచ్చాక ఎలా ఉన్నాడు. ఆయన తెలంగాణ ప్రజలకు శాపంగా మారిండు. అన్ని రాష్ట్రాలలో లక్షల ఇండ్లు కట్టేశారు కానీ తెలంగాణలో మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు'' అని పేర్కొన్నారు. 

''తెలంగాణ నుండి స్పైస్ బోర్డు కొచ్చిన్ ఎందుకు వెళ్ళింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా వున్న జీవన్ రెడ్డికి సోయి లేదా'' అని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించారు.