ఆర్టీసి ఉద్యోగులకు బిజెపి ఎంపీ బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందని వాటిని సానుభూతితో పరిష్కరించాల్సిందేనని ప్రభుత్వానికి సూచించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని సంజయ్ తప్పుబట్టాడు. 

ఆర్టీసీ కార్మిక ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అందరి సంపూర్ణ మద్దతు పలకాలని ఎంపీ పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులు బాగుపడతారన్న   కేసీఆర్ ఇప్పుడిలా  ఎందుకు వ్యవహరిస్తున్నాడో తెలియడం లేదన్నారు. ఆర్టిసి ప్రభుత్వంలో విలీనం చేయడమే కాదు వారికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెచ్చరించారు. 

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించడంతో సమ్మె అనివార్యమయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అర్థరాత్రి నుండి ఆర్టిసి ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అయినప్పటికి ప్రభుత్వం దిగిరాలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టిసి ఉద్యోగులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇలా తాజాగా బండి సంజయ్ కూడా వారికి మద్దతు ప్రకటించారు.