సోమవారం వెలువడిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని స్థానిక బిజెపి ఎంపీ బండి సంజయ్ అన్నారు. గతంతో పోల్చితే బీజేపీకి గణనీయమైన ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. 60 డివిజన్లకు గాను 53 చోట్ల పోటీ చేసి 12 స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. చాలా డివిజన్లలో స్వల్ప  ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచామని వివరించారు. 

తీవ్ర ఉత్కంఠ నడుమ సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

read more  బండి సంజయ్ కు షాక్... కరీంనగర్ లో పాగావేసిన టీఆర్ఎస్

గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలే గెలుచుకుందని.. ఈ సారి బలం 12కు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్నికలో క్రమంగా పుంజుకుంటూ బీజేపీ పట్టు సాధించుకుంటోందని వివరించారు. బీజేపీ ఎదుగుతున్న తీరుతో భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కుట్రలు చేధించాం

అవినీతి, అక్రమ పద్ధతుల్లో గెలవాలని ప్రయత్నించిన టీఆర్ఎస్... డివిజన్ విభజన దగ్గర నుంచి పోలింగ్ వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడిందని ఎంపీ  సంజయ్ విమర్శించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నించినప్పటికీ గట్టి పోటీ ఇవ్వగలిగామని పేర్కొన్నారు. 

టీఆర్ఎస్, ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు.  ఎంఐఎం పోటీ చేసిన చోట టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని అన్నారు. కొన్నిచోట్ల ఎంఐఎం ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ కు వేయించిందని  తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందంతో వ్యవహరించాయని మండిపడ్డారు.  

read more  పనిచేయకుంటే పదవులు పోతాయి..గెలిచినోళ్లంతా యాదికుంచుకోండి: కేటీఆర్ వార్నింగ్‌

టీఆర్ఎస్ అభ్యర్థులు కొన్నిచోట్ల కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 ఖర్చు చేశామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. చాలా డివిజన్లలో కాంగ్రెస్ నామమాత్రంగా అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ పోటీ ఇవ్వడంలో ఆసక్తి చూపలేదని  విమర్శించారు. 

కాంగ్రెస్ పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు కోసమే కృషి చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు.  కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రెండు స్థానాల నుంచి 12 స్థానాలకు చేరుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.