పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లె గ్రామానికి చెందిన జాబు కిరణ్ ఆర్మీ జవాన్ రాజస్థాన్ రాష్ట్రంలోని బైతూ పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై స్థానిక పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లెకు చెందిన జాబు కిరణ్ కొంత కాలం క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం అతను రాజస్థాన్ రాష్ట్రంలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

శనివారం నాడు కిరణ్ తాను పని చేసే ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే కిరణ్ ఆత్మహత్య చేసుకొన్నాడని రాజస్థాన్ పోలీసులు సమాచారం ఇవ్వడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కిరణ్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కిరణ్ ఆత్మహత్య చేసుకొన్న ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు.