కరీంనగర్ జిల్లాలో భయం భయం... మరో యువకుడికి కరోనా లక్షణాలు
విదేశాల నుండి వచ్చిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని హోం క్వారంటైన్ నుండి హాస్పిటల్ కు తరలించారు వైద్యాధికారులు.
కరీంనగర్: కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. అలాగే అనుమానిత కేసులు కూడా రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హైదరాబాద్ తర్వాత ఈ వైరస్ కారణంగా అత్యధికంగా ప్రభావితమైంది కరీంనగర్ జిల్లా. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదయితే అందులో 11 కేసులు కరీంనగర్ నుండే వున్నాయంటే అక్కడ పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది. తాజాగా ఈ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదయ్యింది.
థాయిలాండ్ నుండి ఇటీవలే స్వదేశానికి వచ్చిన వ్యక్తికి కరోన వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబెడ్కర్ నగర్ కాలనీకి చెందిన రాసపల్లి తిరుపతి థాయిలాండ్ లో టూరిస్ట్ గైడ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన సోదరుడికి కొడుకు పుట్టిన సంధర్బంగా ఈ నెల శనివారం 21న పట్టణానికి చేరుకున్నాడు.
విదేశం నుండి వచ్చిన వ్యక్తి కావడం, మరో పక్క వైరస్ ప్రబళుతున్న తీరుతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఇంట్లోనే క్వారంటైన్ లో వుండాలని సూచించారు. కరోనా నియత్రణ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ దేశ్ పాండే, ప్రభుత్వ వైద్యాధికారి శివప్రతాప్,పట్టణ ఎస్సై రవిప్రసాద్ లు గత శనివారం తిరుపతి ఇంటికి వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని హెచ్చరించి చేతికి స్టాంప్ కూడా వేశారు.
అయితే నిబంధలను లెక్క చేయకుండా తిరుపతి స్నేహితులతో బయటకు రావడం, నిబంధనలు బేఖాతరు చేయడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ మరోసారి తిరుపతిని వారి ఇంటి వద్ద హెచ్చరించారు. అతడిలో కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు అతన్ని 108 అంబులెన్స్ లో వైద్య పరీక్షల నిమిత్తము ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవాలంటే బయటకు రాకుండా ఇండ్లకే పరిమితం అవ్వాలని అధికారులు సూచించారు. పలు అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ప్రజలకు సూచించారు.