జగిత్యాల: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలోనూ వేగంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు అనుమానిత కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 పైచిలుకు కేసులు నమోదయితే  అందులో 11 కరీంనగర్ కు చెందినవే. పాజిటివ్ కేసులే కాదు అనుమానిత కేసులు కూడా రోజూ బయటపడుతున్నాయి. 

తాజాగా జగిత్యాల జల్లా కోరుట్లకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు అతడిని కరీంనగర్ ఐసోలేషన్ కు తరలించారు. అతడి నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అతడిని ప్రస్తుతం క్వారంటైన్ లో పెట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు. 
 
జగిత్యాల జిల్లాలో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు స్వీయ నియంత్ర పాటించాలని ఎస్పీ సిధు శర్మ ప్రజలకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ లు, పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.  ఈ రోజు నిబంధనలకు విరుద్దంగా జిల్లా వ్యాప్తంగా 149 వాహనాలు సీజ్, హోమ్ ఐసోలేషన్ కు సంబంధించిన ఆరు కేసులు, ఉల్లంఘనల కు సంబంధించి 6  కేస్ లు నమోదు చేసినట్లు తెలిపారు. 

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సీజ్ చేసిన వాహనాలను కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత విడుదల చేయడం జరిగుతుందని సింధు శర్మ వెల్లడించారు.