కరీంనగర్: గత ఐదు రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు గీతా భవన్ నుండి బస్టాండ్ వరకు అన్ని పార్టీలు కలిసి ర్యాలీ నిర్వహించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులకు  సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందన్నారు. వాటిని సానుభూతితో పరిష్కరించాల్సింది పోయి అణిచి వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. 

ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. గతంలో తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటానని అన్న కెసిఆర్ నేడు వాళ్లను ఏ విధంగా తొలగిస్తారు అని ప్రశ్నించారు. 

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారికి రావలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  బస్టాండ్ లో మహిళలు బ్యాగులను మధ్యలో పెట్టి బతుకమ్మ ఆడారు. ఒక కార్మికుడు పిట్టల దొర వేషంలో ఆకట్టుకున్నాడు. 

నాయకులంతా కలిసి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అన్ని పార్టీలు కలిసి డిపో ముందు నినాదాలతో నిరసన తెలిపారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాయకులు అన్నారు.