పోలీసులు అందించే సత్వర సేవల ద్వారా పోలీస్ శాఖకు గుర్తింపు లభిస్తుందని కరీంనగర్ అడిషనల్ డిసిపి (పరిపాలన) చంద్రమోహన్ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు పోలీసులు మానసికంగా శారీరకంగా రేయింబవళ్ళు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి (పరిపాలన) చంద్రమోహన్ మాట్లాడుతూ నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలన్నారు.

కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా ప్రతి షిఫ్ట్లో కనీసం రెండు సమావేశాలు నిర్వహించి ప్రజల భద్రత,రక్షణ కోసం పోలీస్ శాఖ తీసుకున్న చర్యలను వివరించాలని తెలిపారు. నేరాల నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాటులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.

సమర్థవంతమైన సేవలందించే పోలీసులకు శాఖాపరంగా రివార్డులను అందజేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఐటి సెల్, సైబర్ ల్యాబ్ ఇంచార్జ్ ఆర్ఎస్ఐ మురళి తదితరులు పాల్గొన్నారు.