కరీంనగర్: నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకున్ని చేసిన కన్నకొడుకే తన ఆలనా పాలనను చూసుకోకపోవడంలో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కడుపున పుట్టినవాడే కాదు కోడలు కూడా నిత్యం వేదింపులకు గురిచేయడంతో మనస్థాపానికి గురయిన ఓ వృద్దురాలు ఆత్మహత్యకు పాల్పడబోయిన విషాద సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుతం వేములవాడ లో నివాసం ఉంటున్న వృద్ధురాలు నరికుల్ల లచ్చవ్వ (90)  భర్త మరణాంతరం ఆమె కొడుకుకు తండ్రి ఉద్యోగం లభించింది. ప్రస్తుతం సిరిసిల్లలోని బిసి హాస్టల్లో  పనిచేస్తున్న కొడుకు ఆదరించక పోవడంతోపాటు కోడలి వేధింపులు భరించలేకపోయింది. ఆమెకు నెలనెలా వచ్చే పెన్షన్ రూ.10వేలు తీసుకుని కూడా ఆదరించడం లేదు. ఇలా కొడుకు ఆదరనకు నోచుకోకపోవడంతో  ఆ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. 

తన ఇంటినుండి కాలినడకన వచ్చిన ఆమె ఆత్మహత్యకు సిద్ధమైంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె చెరువులో మునిగి ఆత్మహత్యకు పాల్పడపోతున్న విషయాన్ని ఒక గొర్రెల కాపరి ద్వారా సమాచారం అందుకున్న లేక్ పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే సగం వరకు నీటిలో మునిగిపోయి ఉన్న వృద్ధురాలిని బయటకి తీసిన లేక్ పోలీసులు మొదట ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆమె కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అతడికి అప్పగించారు. 

తల్లి బాగోగులు చూసుకోవాలని చెప్పడంతోపాటు, ఇలాంటి సంఘటన పునరావృతం అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఓ వృద్ధురాలిని రక్షించడంలో కీలక పాత్ర పోషించిన లేక్ పోలీస్ అవుట్ పోస్టు ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి వారిని అభినందించడంతో పాటు రివార్డులను ప్రకటించారు.