ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసిన కామాంధుడికి పాక్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ నెల 17న ఉరిశిక్ష వేసేందుకు లాహోర్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇమ్రాన్ అలీ(24) కొంత కాలం క్రితం ఏడేళ్ల బాలికపై రేప్ చేసి.. అనంతరం హత్య చేశాడు. ఇలా ఏడుగురు బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చాడని తేలింది. ఇటీవల లాహోర్‌ కేంద్ర కారాగారంలో యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టి.. ఈ దారుణానికి ఒడిగట్టినందుకు నిందితుడికి నాలుగు సార్లు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. 

బాలిక శవాన్ని దాచినందుకు రూ.4.1 మిలియన్ల జరిమానా విధించారు. బాధితురాలి కుటుంబానికి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు రూ.6లక్షల పరిహారం ఇవ్వాలని నిందితుడిని ఆదేశించారు. ఇమ్రాన్‌కు కిడ్నాపింగ్‌, రేప్‌, హత్య, టెర్రరిజం సంబంధిత కార్యకలాపాల్లో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇమ్రాన్ అలీ హైకోర్టు, సుప్రీంకోర్టులను అప్పీలు చేసినా ఆయా కోర్టులు దోషి పిటిషన్లను తిరస్కరించాయి. దీంతో అలీ పాకిస్థాన్ అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టారు. పాక్ అధ్యక్షుడు కూడా అలీ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంతో ఇతన్ని ఉరి తీయనున్నారు.