ప్రేమను ప్రపోజ్ చేయడానికి అనేక మార్గాలు వెతుకుతుంటారు ప్రేమికులు. అలాంటి ఓ వినూత్న ప్రయత్నం ఆ ప్రేమ జంటకు చేదు అనుభవాన్ని పంచింది. తన ప్రపోజల్ తో ప్రేయసిని సర్ ఫ్రైజ్ చేయాలనుకుంటే ప్రకృతి వారికి ఇంకో సర్ ప్రైజ్ ఇచ్చింది. చివరికి ప్రాణాలు పోకుండా కాలు ఫ్రాక్చర్ తో బయటపడ్డారు. 

వివరాల్లోకి వెడితే..  అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 650 అడుగుల ఎత్తైన కొండపై తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. ఆమె కూడా సంతోషంతో ఓకే చెప్పేసింది. ఆ తరువాత కొద్ది క్షణాలకు ఆ మహిళ కొండపై నుంచి జారి కింద పడింది. అయితే అంత ఎత్తైన కొండపై నుంచి పడినప్పటికి ఆమె ప్రాణాలతో బయటపడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తను ప్రేమిస్తున్న 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్‌ చేయడానికి కారింథియా కొండపైకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లాడు. వారు ట్రెక్కింగ్‌ చేస్తూ కొండపైకి ఎక్కిన అనంతరం అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను అంగీకరించిన ఆ మహిళ  ఆకస్మాత్తుగా కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయింది. కాగా అక్కడ అంతా మంచు ఉండటంతో ఈ ఘోర ప్రమాదం నుంచి ఆమె బతికి బట్టకట్టింది.

ఇక్కడో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమె పడిపోతున్నప్పుడు ఆమె చేయి పట్టుకుని పైగి లాగడానికి అతను ప్రయత్నం చేశాడు. అతని చేయి పట్టుతప్పి అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతను ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని కింద పడిపోకుండా గాల్లో వేలాడాడు. 

ప్రమాదంలో ఉన్న ఈ జంటను గమనించిన బాటసారులు వెంటనే ఎమర్జెన్సీ రెస్క్యూ టీంకు  సమచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని రక్షించింది. అయితే ఆ వ్యక్తిని మాత్రం హెలికాప్టర్‌ సహాయంతో రక్షించినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. 

ఆ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మంచు లేకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిచించాం. ఈ ప్రమాదంలో అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అతడి కాలు ఫ్యాక్చర్‌ అవ్వడంతో వైద్యులు చికిత్స చేసి కట్టుకట్టారు’ అని ఆయన పేర్కొన్నారు.