యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా... యోగా చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే... ఈ యోగానే ఓ యువతికి ప్రాణం మీదకు తెచ్చింది. ఓ కాలేజీ విద్యార్థి బాల్కనీలో యోగా పోజు ఇవ్వడానికి ప్రయత్నించి.. 80అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. ఈ సంఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మెక్సికోకి చెందిన అలెక్సా టెర్రెజా అనే విద్యార్థిని ఆరో అంతస్థులోని తన ఇంటి బాల్కనీలో యోగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆ క్రమంలో ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి.. అక్కడి నుంచి కిందపడి పోయింది. కాగా దీనికి సంబంధించిన ఫోటో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె యోగా చేస్తుండగా... పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు ఆ ఫోటో తీసింది. ఆమె ద్వారానే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆరో అంతస్తు నుంచి కిందపడటంతో అలెక్సాకీ  తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

కాగా ఆమె శరీరంలోని 110 ఎముకలు విరిగిపోయినట్లు వైద్యులు చెప్పారు. దాదాపు మూడు సంవత్సరాలపాటు ఆమె కనీసం నడవడానికి కూడా కుదరదని వైద్యులు చెప్పారు. ఆమె మోకాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని సర్జరీలు చేయగా... మరిన్ని చేయాల్సి న అవసరం ఉందన్నారు. 

ఈ ఘటనలో ఆమెకు తీవ్ర  రక్త స్రావం కావడంతో అలెక్సా కుటుంబసభ్యులు రక్తదాతల కోసం సోషల్ మీడియాను ఆశ్రయించారు. ఆమె కు రక్తం ఇవ్వడానికి దాదాపు 100మంది దాతలు ముందుకు రావడం విశేషం. ఇప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అలెక్సా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.