పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. నేడు ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ప్రమాణస్వీకారానికి మాజీ ఇండియన్ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం పాకిస్థాన్ వెళ్లారు.ఈ సందర్భంగా సిద్ధూ తన స్నేహితుడు ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక కానుక అందించారు.

సిద్ధూతో పాటు మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్‌, సునీల్‌ గావస్కర్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆహ్వానాలు పంపారు. సిద్ధూ మాత్రమే మొదటి నుంచి తాను ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే, శుక్రవారం సిద్ధూ పాక్‌ చేరుకున్నాడు. తన స్నేహితుడికి సిద్ధూ కశ్మీరీ శాలువాను కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. 

అయితే.. భారత్ కి చెందిన ఓ మంత్రి పాక్ ప్రధాని ప్రమాణస్వీకారానికి వెళ్లడంతో.. అందరి దృష్టి ఆయనమీదే పడింది. ఈ ప్రమాణస్వీ కార కార్యక్రమంలో సిద్ధు ఎక్కడ కూర్చున్నాడనే విషయంపై కూడా మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది.

 

ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూను పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన కూర్చోబెట్టడం గమనార్హం. విదేశీ నేతల సరసన సిద్ధూను కూర్చోబెట్టకుండా.. పీవోకే పాలకుడి పక్కన కూర్చోబెట్టడం విమర్శలకు తావు ఇస్తోంది. 

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వాను సిద్ధూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘నేను ఇక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదు. భారత సహృద్భావ రాయబారిగా వచ్చా’నని సిద్ధూ తెలిపారు.