టర్కీలోని అమెరికన్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం చోటుచేసుకుంది.  గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో.. ఈ కాల్పులకు పాల్పడినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు ఎంబసీ సెక్యూరిటీ బూత్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి పారిపోయినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో ఎంబసీ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బక్రీద్‌ను పురస్కరించుకుని టర్కీలోని యూఎస్‌ ఎంబసీని వారం పాటు మూసివేశారు. దీంతో ఘటన సమయంలో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేరు.

కాల్పుల గురించి సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులు వచ్చిన కారు కోసం గాలిస్తున్నారు.

అమెరికా, టర్కీ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడమేగాక.. సుంకాలను కూడా పెంచేసింది. దీంతో టర్కీలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా టర్కీలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట కాల్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.