Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌లో మీడియాపై తాలిబాన్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కచ్చితంగా ఆ 11 నిబంధనలు పాటించాల్సిందే..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నది. పాత్రికేయ స్వేచ్ఛను కాలరాస్తూ వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నది. తాజాగా, మీడియాను నియంత్రించడానికి ప్రత్యేకంగా 11 చట్టాలను రూపొందించింది. దాని ప్రకారం, ప్రభుత్వానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా వార్తలు రాయవద్దు. ప్రతి వార్తను ప్రభుత్వ సమన్వయంతోనే ప్రచురించాలని తెలిపింది.

taliban govt crushing media rights in afghanistan
Author
New Delhi, First Published Sep 26, 2021, 12:17 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో క్రమంగా అన్ని హక్కులూ ఉల్లంఘనలకు గురవుతున్నాయి. మహిళా హక్కులే కాదు, పాత్రికేయుల హక్కులనూ తాలిబాన్ ప్రభుత్వం కాలరాస్తున్నది. మీడియా స్వేచ్ఛకు మరిన్ని తూట్లు పొడుస్తూ వారి హక్కులను మరింత భంగం కలిగిస్తున్నది. తాజాగా, దేశంలోని మీడియాకు 11 చట్టాలను రూపొందించింది. ఇవి మీడియా ప్రతినిధుల విధులకు తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. అంతేకాదు, స్వేచ్ఛగా రిపోర్ట్ చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి.

అసలు ఏ వార్తలు పబ్లిష్ చేయాలి? ఎలాంటి కథనాలకు అనుమతి ఉంటుంది? వంటి అనేక ఆంక్షలను ఈ 11 చట్టాలు చెబుతున్నాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా, లేదా దేశ ‘ప్రముఖుల’కు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రచురించవద్దు. అంతేకాదు, ప్రభుత్వ మీడియా కార్యలయానికి సమన్వయంలో వార్తలు ప్రచురించాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతుల మేరకే వార్తలు ప్రచురించాలని తెలిపింది.

సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రజలకు అవగాహన కలిగించే కథనాలను  ప్రచురిస్తుంది. చర్చలు నిర్వహిస్తుంది. కానీ, మీడియా కూడా ప్రభుత్వ విధించిన ఆంక్షల చట్రంలోనే పనిచేయాల్సి రావడం ఆందోళనకరం.

అమెరికాకు చెందిన ప్రెస్ ఫ్రీడమ్ సంస్థకు చెందిన సీనియర్ సభ్యుడు స్టీవెన్ బట్లర్ ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంలో జర్నలిస్టులు భయకంపితులవుతున్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్టుల నుంచి వందలాది మెయిల్స్ కుప్పలుతెప్పలుగా సంస్థకు వస్తున్నాయని వివరించారు. సహాయాన్ని అర్థిస్తూ తమను సంప్రదిస్తున్నారని చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ కుప్పకూలిపోయిన తర్వాత కనీసం 150 మీడియా సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేక మూతపడిపోయాయి. తాలిబాన్లు మీడియా హక్కులపై కలుజేసుకోవడం, నిరంతరం ఆటంకాలు సృష్టించడమే ఇందుకు ప్రధాన కారణమని ఆఫ్ఘనిస్తాన్ మీడియా సంస్థ టోలో సభ్యుడు ఒకరు చెప్పారు. అంతేకాదు, ప్రముఖ మీడియా సంస్థలు ప్రింట్‌ను నిలిపేసి కేవలం ఆన్‌లైన్ ఎడిషన్‌లకే పరిమితమవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios