సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్‌ దేశంలోని ఫుట్‌బాల్ స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్‌ దేశంలోని ఫుట్‌బాల్ స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని శాన్ సాల్వడార్‌లోని కస్కట్లాన్ స్టేడియంలో శనివారం రాత్రి అలియాన్జా ఎఫ్‌సీ, క్లబ్ డిపోర్టివో ఎఫ్‌ఏఎస్ జట్లు క్వార్టర్-ఫైనల్ గేమ్‌ను ఆడుతున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలోని సాధారణ విభాగంలో తొక్కిసలాట జరగింది. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. 

తొక్కిసలాట నేపథ్యంలో వెంటనే ఆట నిలిపివేయబడింది. అధికారులు, సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ తొక్కిసలాటలో 12 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. ‘‘కస్కట్లాన్ స్టేడియంలో జరిగిన సంఘటనలకు సాల్వడోరన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తోంది’’ అని ఆ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ సంఘటనలో మరణించిన వారి బంధువులకు సానుభూతి తెలియజేసింది. ఈ ఘటనపై నివేదికను కోరినట్టుగా పేర్కొంది. 

తొక్కిసలాట జరిగిన స్టేడియానికి అత్యవసర బృందాలను నియమించామని, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించామని సాల్వడోరన్ ఆరోగ్య మంత్రి ఫ్రాన్సిస్కో అలబీ ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఈ స్టేడియం 44 వేలకు పైగా అభిమానుల సామర్థ్యం కలిగి ఉంది. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు హాట్ ఫెవరేట్ కావడంతో.. పరిమితికి మించి అభిమానులు స్టేడియంలోకి దూసుకువచ్చారని.. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.