పెరూలో  శవాల గుట్ట బయటపడింది. రాజధాని లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంతంలో 227 మానవ శరీర అవశేషాలను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. పురావస్తు శాఖ తవ్వకాలలో భాగంగా ఈ అస్తిపంజరాలు బయటపడ్డాయి.  దేవుడికి తమను తాము అర్పించుకోవడానికి దాదాపు 227మంది చిన్నారులు ప్రాణాలు అర్పించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారుల వయసు అంతా దాదాపు 4 నుంచి 14 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం.

బయటపడ్డ మనుషుల అవశేషాలన్నీ 1200 నుంచి 1400 సంవత్సర కాలానికి చెందినవిగా గుర్తించారు. గతేడాది రాజధానికి దగ్గర్లో ఉన్న పంపాలా క్రజ్ వద్ద తవ్వకాల్లో 56 పుర్రెలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. అనంతరం ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న హువాన్ చాకోలో  తవ్వకాలు జరపగా 190  చిన్నారుల శరీర అవశేషాలు బయటపడ్డాయి. వాటితోపాటు 200 ఒంటెల అస్థిపంజరాలు కూడా లభించాయి.

పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన బొక్కల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడం గమనార్హం. మొత్తం కలిపి 227 చిన్నారుల అవశేషాలు లభించాయని చెప్పారు. కాగా తమ తవ్వకాలను ఇంకా కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇంత మంది ఒకేసారి ప్రాణత్యాగం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు. సంప్రదాయం ప్రకారమే వారు ప్రాణ త్యాగం చేసి ఉంటారని భావిస్తున్నారు.