Asianet News TeluguAsianet News Telugu

హౌడీ మోడీ ఈవెంట్ కు హ్యూస్టన్ ను వేదికగా ఎంచుకోవడానికి కారణాలు ఇవే...

హ్యూస్టన్ నగరం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ భారత సంతతి ప్రజల జనాభా అత్యధికం. ఈ సభకు ఇప్పటికే దాదాపు 50వేల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో భారతీయులను వేరే దేశంలో ఉద్దేశించి ప్రసంగించడం అంటే, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినట్టే.

reasons for selecting houston as the spot for howdy modi event
Author
New Delhi, First Published Sep 22, 2019, 1:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హ్యూస్టన్: అమెరికాలో ఎన్నో నాగరాలున్నా, హ్యూస్టన్ నగరాన్నే ఎందుకు హౌడీ మోడీ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు అనే అనుమానం కలుగక మానదు. ఇదేదో ఆషామాషీ నిర్ణయం మాత్రం కాదు. చాలా ఆలోచించి ఎన్నో చర్చలు జరిపిన అనంతరం ఈ నగరాన్ని ఎంచుకున్నారు. ఇలా ఎందుకు ఎంచుకున్నారు, దీని వెనుక కారణాలేంటి, ఎందుకు ట్రంప్ హాజరవుతున్నాడు వంటి అంశాలను తెలుసుకుందాం. 

హ్యూస్టన్ నగరం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ భారత సంతతి ప్రజల జనాభా అత్యధికం. ఈ సభకు ఇప్పటికే దాదాపు 50వేల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో భారతీయులను వేరే దేశంలో ఉద్దేశించి ప్రసంగించడం అంటే, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినట్టే. అందులోనూ ప్రపంచంలో సూపర్ పవర్ గా వెలుగొందుతున్న దేశంలో మన ప్రధాని ఇంతమందినుద్దేశించి ప్రసంగించడం ఒక రకంగా ప్రపంచ దేశాల్లో స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసినట్టే. 

అమెరికాలోనే అత్యంత సంపన్నవర్గం భారతీయులే. ఇలాంటి పరిస్థితుల్లో వారు అధికంగా ఉండే ప్రాంతంలో సభలో మాట్లాడడం అనేది అమెరికా రాజకీయచిత్రపటంపైన కూడా భారతీయులు ఎంతటి ముద్రను వేయగలుగుతున్నారో మనకు తెలియపరుస్తుంది. 

ఈ ఈవెంట్ తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో భారత్ ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్తాన్ కాచుకొని కూర్చుంది. ఇలా ఇంతటి భారీ సభ తరువాత, అందులోనూ అమెరికా అధ్యక్షుడితో వేదిక పంచుకున్న తరువాత వెళ్లి మాట్లాడనుండడంతో, భారత్ మాట మరింత చెల్లుబాటవుతుంది. మన గౌరవం మరింత పెరుగుతుంది. 

ఇలాంటి ఈవెంట్లలో పాల్గొనడంవల్ల తన ఇమేజ్ ను మోడీ కూడా బాగా పెంచుకోగలుగుతారు. ఇప్పటికే అక్కడ ఆయన ల్యాండ్ అయినప్పటినుండి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పర్యాయం హ్యూస్టన్ లో నిర్వహించతలపెట్టిన హౌడీ మోడీ ఈవెంట్ గత మాడిసన్ స్క్వేర్ ఈవెంట్ కన్నా రెండింతలు పెద్దది. దాదాపు 50వేల మంది పాల్గొనబోతున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో ప్రజలు మోడీ మోడీ అనే నినాదాలతో హోరెక్కిస్తుంటే మోడీ ఇమేజ్ రాకెట్లా మరింత పైపైకి వెళుతుంది. 

హ్యూస్టన్ నగరానికి ప్రపంచ ఇంధన రాజధానిగా పేరుంది. అమెరికాలో చమురును ఉత్పత్తి చేసే 8 ప్రధాన రాష్ట్రాల్లో టెక్సాస్ ఒకటి. భారత్ ఏమో చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించడంతో, భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతిని ఆపేసింది. 

తాజాగా సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా ఒత్తిడిని ఎదుర్కుంటోంది. దీనితో ముడి చమురు ధర రోజురోజుకి పైకి ఎగబాకుతోంది. దీనివల్ల విలువైన విదేశీ మారకం తరలిపోతోంది. కాబట్టి భారతదేశానికి ఒక నమ్మకమైన స్థిరంగా చమురును  సరఫరా చేయగల దేశం అవసరం. 

అమెరికాతో నడుస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో , చైనా, అమెరికా నుంచి చమురు దిగుమతులను ఆపేసింది. అమెరికా చమురు కంపెనీలకు కూడా ఇప్పుడు ఒక మార్కెట్ అవసరం. అందుకోసమే వారు భారత్ వైపు చూస్తున్నారు. మోడీ కూడా అక్కడి చమురు కంపెనీల అధికారులతో ఈ విషయమై అక్కడ ల్యాండ్ అవ్వగానే చర్చలు కూడా జరిపారు. 

ఇదంతా బాగానే ఉంది మరి ట్రంప్ ఎందుకు వస్తున్నట్టు? 

ఈ విషయం మనకు అర్థం కావాలంటే అక్కడ భారతీయుల స్థితిగతులు, మారుతున్న రాజకీయ సమీకరణాలను మనం అర్థం చేసుకోవాలి.  అక్కడ సెటిల్ అయిన భారతీయులు బాగా సంపాదించారు. అక్కడ ధనికుల్లో భారతీయ సంతతికి చెందిన వారి సంఖ్య అధికం. భారత సంతతి ప్రజలు విద్యావంతులు. 

సహజంగానే ఉండే వర్గ వ్యవస్థలో మనవాళ్ళను ఉన్నతవర్గానికి చెందినవారుగా పేర్కొనవచ్చు. వీరు తమని తాము మిగిలిన శరణార్థులతో పోల్చుకోవడానికి ఇష్టపడరు (బహుశా మన దేశంలోని కుల వ్యవస్థ కారణమేమో). వారు తమని తాము అక్కడి లోకల్ ప్రజల్లో ఒకరిగా భావిస్తారు. 

ఇప్పటివరకు అక్కడి భారత సంతతి  రాజకీయనాయకులనంతా కూడా డెమొక్రాట్లే. వారు డెమొక్రాట్ల ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెడతారు కూడా. గత పర్యాయం భారతీయ అమెరికన్లలో దాదాపుగా 84శాతం మంది ప్రజలు ట్రంప్ కు వ్యతిరేకంగా హిల్లరీ క్లింటన్ కు ఓటు వేసినట్టు ఒక సర్వే తెలుపుతుంది. కానీ ఈ వర్గ వ్యవస్థ వల్ల రిపబ్లికన్ల పిలుపుకు భారతీయులు స్పందించడం మొదలుపెట్టారు. 

ఈ ఎన్నికల సంవత్సరంలో మోడీ అక్కడికి వెళ్లి ట్రంప్ తో సహా వేదిక పంచుకొని మాట్లాడితే అక్కడి భారత సంతతి ప్రజలకు ట్రంప్ పట్ల సానుకూల వైఖరి కలిగే ఆస్కారం ఉంది. ఇలా భారత సంతతి ప్రజల సపోర్టు గనుక ట్రంప్ కు తోడైతే, ట్రంప్ ఎన్నికల్లో తేలికగా గెలవచ్చు అని భావిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios