మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. గల్ఫ్ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. తాజాగా, ఈ జాబితాలోకి తాలిబాన్ పాలనలోని అఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. మూఢ భక్తులపై భారత్‌కే లెక్చర్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: బీజేపీ ప్రతినిధిగా సస్పెండ్ అయిన నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలైతే భారత దౌత్య కార్యాలయాలకు ఆదివారం సమన్లు పంపి మరీ నిరసన వ్యక్తం చేశాయి. ముస్లిం దేశాలు ఒక దాని వెనుక మరొకటి నుపుర్ శర్మ కామెంట్లను విమర్శిస్తున్నాయి. ఈ జాబితాలోకి కొత్తగా అఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. మూఢులపై ఇప్పుడు తాలిబాన్లు కూడా భారత్‌కు లెక్చర్లు ఇస్తున్నారు.
నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తున్న దేశాల జాబితాలోకి తాలిబాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా వచ్చి చేరింది. మూఢులపై భారత్‌కే లెక్చర్ ఇచ్చింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలను తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఖండించారు. అలాంటి మూఢులు పవిత్రమైన ఇస్లాం మతాన్ని అవమానించే అవకాశాన్ని భారత్ ఇవ్వరాదని అన్నారు. వారిని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ముస్లిం మనోభావాలను రెచ్చగొట్టే స్వేచ్ఛ ఇవ్వొద్దని పేర్కొన్నారు. భారత్‌లో అధికారిక పార్టీ నేత ఇస్లాం ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.
ఇప్పటి వరకు ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించాయి. తమ నిరసన వ్యక్తం చేశాయి.
పాకిస్తాన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మోడీ సారథ్యంలో భారత్‌లో మత స్వేచ్ఛ అడుగంటిందని, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని గమనించాలని, భారత్‌ను మందలించాలని అన్నారు. మహమ్మద్ ప్రవక్త కోసం ముస్లింలు అందరూ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అరబ్ దేశాల్లో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గల్ఫ్ దేశాలు భారత దౌత్య అధికారులకు సమన్లు జారీ చేశాయి. కొన్ని దేశాల్లోనైతే భారత వస్తువులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వచ్చాయి. కువైట్‌లో భారత వస్తువులను మార్కెట్ నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చాయి.
భారత ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించింది. నుపుర్ శర్మను బీజేపీ వెంటనే సస్పెండ్ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ వైఖరిని వెల్లడించబోవని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు బయటి శక్తుల అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంది. భారత వైఖరిని ఇది ప్రతిబింబించదని వివరించింది. నుపురర్ శర్మను సస్పెండ్ చేయడంతోపాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇంచార్జీ నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
