జీ7 శిఖరాగ్ర సదస్సును ముగించుకుని పపువా న్యూగినీలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జేమ్స్ మారెప్ మోడీ పాదాలను తాకారు.
జీ7 శిఖరాగ్ర సదస్సును ముగించుకుని పపువా న్యూగినీలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో మోడీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మారెప్ స్వాగతం పలికారు. అంతేకాదు మోడీ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని ఆయనను వారించే ప్రయత్నం చేశారు. అనంతరం జేమ్స్ తన దేశానికి చెందిన నేతలు, అధికారులను మోడీకి పరిచయం చేశారు.
పపువా న్యూగినీ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోడీ.. అక్కడి కళాకారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు. పపువా న్యూగినీ పర్యటనలో భాగంగా ఆయన ఇండో - పసిఫిక్ దీవుల సహకార ఫోరమ్ మూడో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. దీనిని 2014లో ఏర్పాటు చేశారు. పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని వున్న 14 దీవులు, దేశాలు ఇందులో సభ్యులుగా వున్నాయి.
ఇకపోతే జీ 7 సదస్సులో పలు దేశాల అధినేతలతో ప్రధాని సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులతో భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే వున్నారు.
మరోవైపు.. వచ్చే నెలలో నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన గురించి బైడెన్ , మోడీ మధ్య ప్రస్తావన వచ్చింది. మోడీ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రముఖుల నుండి అభ్యర్ధనలు వస్తున్న విషయాన్ని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తమపై ఒత్తిడి ఉందని బైడెన్ తెలిపారు.
మరో వైపు అస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్ సైతం మోడీని తమ దేశానికి ఆహ్వానించారు. సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కోసం 20 వేల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. విజయోత్సవ ల్యాప్ లో నరేంద్ర మోడీకి 90 వేల మందికి పైగా ప్రజలు స్వాగతం పలికిన విషయాన్ని అస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ గుర్తు చేసుకున్నారు.
