ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం వస్తోందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ జోస్యం చెప్పారు.బుధవారం నాడు ఆయన తన స్వంత పట్టణం రావల్పిండిలో మాట్లాడారు. కాశ్మీర్ పై పోరాటానికి నిర్ణయాత్మక సమయం వచ్చిందన్నారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య చివరి యుద్దంగా ఆయన అభివర్ణించారు.జమ్మూ కాశ్మీర్ విషయంలో రెఫడరెండం నిర్వహించడంలో  ఐక్యరాజ్యసమితి ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ  ఏడాది అక్టోబర్ మాసంలో భారత్, పాక్ మధ్య యుద్దం వాటిల్లే అవకాశం ఉందన్నారు.పాక్ ఆక్రమిత కాశ్మర్ లో  భారత్ ఎటువంటి దాడికి దిగినా కూడ అది యుద్దం వంటిదేనని ఆయన రెండు రోజుల క్రితం పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో  370 ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని  పాకిస్తాన్  సహించలేకపోతోంది. ఈ విషయమై అంతర్జాతీయ సమాజం కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఈ విషయంలో పాక్ పెద్దగా సఫలం కాలేకపోయింది.

కాశ్మీర్ అంశం పాక్, భారత్ ద్వైపాక్షిక అంశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాత కూడ పాక్ మంత్రి షేక్ రషీద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ సరిహద్దుకు  పాక్ తన బలగాలను తరలిస్తోంది.