భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తన గగనతలాన్ని మార్చి 11 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 11 సాయంత్రం 3 గంటల సమయం వరకు అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా మూసివేస్తున్నట్లు పాక్ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఉత్తర, దక్షిణ మార్గాల ద్వారా కొన్ని ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది. అన్ని విమాన ప్రయాణాలకు మార్చి 9న తమ గగనతలాన్ని పూర్తిగా తెరుస్తున్నామని ప్రకటించిన పాక్ ఆ మరుసటి రోజే.. మూసివేత ప్రకటన చేసింది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత రోజు భారత వైమానిక స్థావరాలపై పాక్ యుద్ధ విమానాలు దాడికి ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది.

దీంతో పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. దీంతో ఆసియా, ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన విమానాలకు తీవ్ర ఆటంకం ఏర్పడి, వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.