యూకే పీఎం బోరిస్ జాన్సన్‌ నాయకత్వంపై అవిశ్వాస ఓటింగ్ జరిగింది. యూకే పార్లమెంటులో ఆయన సొంత పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రహస్య ఓటు వేశారు. పార్టీగేట్ స్కాండల్ కారణంగా బోరిస్ జాన్సన్ సొంత పార్టీ నేతల నుంచే అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఓటింగ్‌లో పార్టీ ఎంపీలు ఆయనపైనే విశ్వాసాన్ని ఉంచారు. విశ్వాసాన్ని నెగ్గిన బోరిస్ జాన్సన్.. యూకే ప్రదానిగా కొనసాగనున్నారు. 

న్యూఢిల్లీ: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌పై సొంత పార్టీ ఎంపీలు విశ్వాస ఓట్లు వేశారు. బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రధాని బోరిస్ జాన్సన్‌పై నో కాన్ఫిడెన్స్ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఈ తీర్మానంలో ప్రధాని బోరిస్ జాన్సన్ విశ్వాసాన్ని పొందలేకపోతే.. ఆయన పార్టీ నాయకుడిగా తప్పుకోవాల్సి ఉంటుంది. తద్వార అధికారంలో ఆయన శకం ముగిసిపోతుంది. కానీ, ఆయన ఈ కాన్ఫిడెన్స్ ఓటింగ్‌లో నెగ్గారు. పార్టీ ఎంపీలు ఆయనపైనే నమ్మకాన్ని ప్రకటించారు. దీంతో ఆయన ప్రధానిగా కొనసాగడానికి మార్గం సుగమం అయింది.

సొంత పార్టీ నేతలే తెచ్చిన సవాల్‌ను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. విశ్వాస ఓటింగ్‌లో బోరిస్ జాన్సన్ 211 మంది ఎంపీల మద్దతును పొందారు. కాగా, 148 మంది కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) ఎంపీలు బోరిస్ జాన్సన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

యూకే పీఎం బోరిస్ జాన్సన్ రెండేళ్లుగా పార్టీగేట్ స్కాండల్‌ను ఎదుర్కొంటున్నారు. దేశమంతటా కరోనా ఆంక్షలు అమలు అవుతున్నప్పుడు ఆయన తన అధికారిక నివాసంలో రహస్యంగా పార్టీల్లో పాల్గొన్నాడని, గ్యాదరింగ్స్ నిర్వహించాడన్న ఆరోపణలు దుమారం రేపాయి. ఈ విషయమై ప్రతిపక్షం సహా సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసహనం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కొందరు బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాన్సన్ తన అబద్ధాలతో పార్లమెంటును తప్పుదారి పట్టించారని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే 1922 కమిటీకి బోరిస్ జాన్సన్‌పై అవిశ్వాసాన్ని తెలుపుతూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రహస్య లేఖలు పంపినట్టు తెలిసింది. ఈ కమిటీ పార్లమెంటులో అధికారిక పదవులు నిర్వహించకుండా ఉండే కమిటీ. ఈ కమిటీకి పార్టీ నేతలపై అవిశ్వాసాన్ని తెలుపుతూ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేస్తే ఓటింగ్ నిర్వహిస్తుంది. బోరిస్ జాన్సన్‌పై అవిశ్వాస ఓటింగ్ నిర్వహించడానికి కండీషన్స్‌ను మీట్ అయ్యేస్థాయిలో అవిశ్వాస ఓటింగ్ విజ్ఞప్తులు వచ్చాయని కమిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే యూకే పార్లమెంటులో బోరిస్ జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై రహస్య ఓటింగ్ జరిగింది.

అయితే, బోరిస్ జాన్సన్‌ను సమర్థిస్తూ 169 మంది ఎంపీలు ప్రకటనలు చేశారు. వారంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు. బోరిస్ జాన్సన్ ఈ సవాల్‌ నుంచి నెగ్గాలంటే మొత్తం 180 ఓట్లు అవసరం. అయితే, ఈ ఓటింగ్ రహస్యంగా జరుగుతుంది. కాబట్టి, బహిరంగంగా జాన్సన్‌ను సమర్థించిన ఎంపీలు అదే వైఖరితో ఆయనను సమర్థిస్తూ ఓటేయాలనే ఏమీ లేదు.

ఈ అనుమానాలు, ఆరోపణలు అన్నింటికి ఆయన ఈ గెలుపుతో గట్టి సమాధానం ఇచ్చినట్టు అయింది. పార్టీ ఎంపీలు బోరిస్ జాన్సన్‌పైనే విశ్వాసాన్ని ఉంచినట్టు స్పష్టం అయింది.