పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఆందోళన అంతా భారత్ పైనే అంటూ ఇమ్రాన్ పేర్కొన్నారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడుల కోసం ఆల్ కాయిదా ఉగ్రవాదులకు పాకిస్థాన్ శిక్ష ఇవ్వడం నిజమేనని ఇమ్రాన్ అంగీకరించారు. సెప్టెంబర్ 11, 2001 నాటి దాడులకు ముందు అల్ కాయిదా ఉగ్రవాదులకు పాక్ సైన్యం, ఐఎస్ఐ శిక్ష ఇచ్చాయని తెలిపారు.

9/11 దాడుల తర్వాత తమ ప్రభుత్వం విధానం మార్చుకుందని, సైన్యం మాత్రం మార్పుపై విముఖత చూపిందని చెప్పారు. అమెరికాకు చెందిన మేధో బృందం- విదేశీ సంబంధాల మండలి(సీఎఫ్ఆర్) లో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అల్ కాయిదా చీఫ్ ఒసాబా బిన్ లాడెన్ ను అమెరికా నేవీ సీల్స్ పాకిస్థాన్ లో గుర్తించి, చంపడంపై దర్యాప్తు ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నకు బదులుగా ఇమ్రాన్ ఈ విషయం చెప్పారు. 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాతో చేతులు కలిపి పాక్‌ అతి పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌ గురించే తాను ఎక్కువ ఆందోళన చెందుతున్నానన్నారు. కాగా, భారత్‌, పాక్‌ అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. తాను చాలా మంచి మధ్యవర్తినని ఇమ్రాన్‌తో భేటీ సందర్భంగా ట్రంప్‌ అన్నారు.