చెవిలో కొద్ది రోజులుగా నొప్పి, దురద వస్తున్నాయని ఓ యువకుడు హాస్పిటల్ కి వెళ్లాడు. కాగా... అతని చెవిలో ఏమున్నాయో చూసి వైద్యులు కూడా షాకయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 26 బొద్దింకలు అతని చెవిలో ఉండటం గమనార్హం. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మెల్ బోర్న్ కి చెందిన ఓ యువకుడు లీ(19)కి ఒకరోజు రాత్రి కుడి చెవిలో  భరించలేని నొప్పి, దురద వచ్చింది. దీంతో తట్టుకోలేక హాస్పిటల్ కి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు షాకయ్యారు. అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని గుర్తించారు. లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర చర్మం పాడైందని వివరించారు. 

అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ఒక బొద్దింక చెవిలో దూరి.. ఆ తర్వాత గుడ్లు పెట్టిందని... అవి పిల్లలుగా మారిన తర్వాత లీకి చెవిలో దురద, నొప్పి వచ్చాయని వైద్యులు చెప్పారు. వాటన్నింటినీ బయటకు తీసి.. చెవిని పూర్తిగా శుభ్రం చేసినట్లు వైద్యులు తెలిపారు.