ఆహారంలో వెంట్రుకలు వస్తే ఎవరికైనా చిరాకుగానే ఉంటుంది. అలా అని అదో పెద్ద నేరంగా భావించలేము కదా. ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. అయితే... ఓ భర్త మాత్రం భార్యకు కఠిన శిక్ష వేశాడు. ఏకంగా భార్యకు గుండు కొట్టించాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్ లోని జోయ్  పుర్హత్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... బంగ్లాదేశ్ లోని జోయ్ పుర్హత్ జిల్లాకి చెందిన బాబ్లూ మొండల్(35)కు పెళ్లై భార్య ఉంది. కాగా... ఇటీవల మొండల్ కి భార్య భోజనం వడ్డించగా... అందులో వెంట్రుక కనిపించింది. అంతే.. అతని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యను నానా రకాలుగా తిట్టేశాడు. అక్కడితో ఆగకుండా... వెంటనే బ్లేడ్ తీసుకొని బలవంతంగా ఆమెకు గుండు గీశాడు.

కాగా... ఈ విషయం బయటకు పొక్కడంతో మానహ హక్కుల సంఘాల నేతలకు కూడా తెలిసిపోయింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. భార్యను తీవ్రంగా వేధించిన కేసు కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతని నేరం కోర్టులో  నిరూపితమైతే దాదాపు 14 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

కాగా... చిన్న కారణానికే భార్యను అంత దారుణంగా వేధించాడని అతనిపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.