వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోడానికి ఓ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేరళ రాష్ట్రానికే చెందిన ఈ ఎన్నారై ఏకంగా రూ.50 కోట్లు  ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కలిసి ఆయన ఈ భారీ మొత్తాన్ని సమకూర్చారు.

కేరళకు చెందిన డా.షంషీర్ వయలిల్ గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. అబుదాబి కేంద్రంగా వీపీఎస్ హెల్త్ కేర్ పేరుతో పనిచేసే సంస్థలకు షంషీర్ చైర్మన్. వివిధ దేశాల్లో దాదాపు 20 ఆస్పత్రులు, 120 మెడికల్ సెంటర్లు ఈ సంస్థ ఆద్వర్యంలో నడుస్తున్నాయి. ఇతడు తన కుటుంబంతో కలిసి అబుదాబిలోనే  నివాసముంటున్నాడు.

అయితే తన స్వరాష్ట్రం వరదల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోవడాన్ని చూసి షంషీర్ చలించిపోయాడు. దీంతో తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కలిసి కేరళకు 26 మిలియన్ దుబాయ్ దిర్హమ్‌ల(దాదాపు రూ.50 కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపించినట్లు షంషీర్ తెలిపారు.

ఇప్పటికే భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు కేరళ ప్రజలకు ఆర్థిక, ఆహార, వస్తు ఇలా తగిన రూపంలో సాయం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా కేరళకు అండగా నిలిచాయి. ఇప్పటికే ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా తమ ఉధారతను చాటుకుంటున్నారు.