ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ అది ఏ కొందరికో దక్కే అవకాశం. కొందరు ప్రేమను పండించుకోవడానికి ఒక సంవత్సరమో, రెండేళ్లో వేచి చూస్తారు. అయినా పెళ్లవుతుందన్న గ్యారెంటీ లేదు.. అలా విడిపోయిన ప్రేయసి, ప్రియుడు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కేటీ రాబిన్స్ అనే అమెరికన్ సైనికుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెన్నీ పియర్సన్ అనే ఫ్రెంచి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు నెలల తర్వాత ఆక్సిస్ ఫ్రంట్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయమే ఆమెకు చెప్పి వీలుంటే తీసుకెళ్లటానికి మళ్లీ వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. రాబిన్స్ తిరిగొస్తాడనే నమ్మకంతో జెన్నీ కొద్దికొద్దిగా అతడి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవటం ప్రారంభించింది.

అయితే యుద్ధం ముగిసినా  కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక అక్కడ లిల్లియాన్ అనే యువతితో పరిచయం ఏర్పడటం, పెళ్లి జరిగిపోవటం సంభవించింది.

ఇటు జెన్నీ కూడా మరో వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లిళ్లు అయినా వేరు వేరు దేశాల్లో ఉంటున్నా  వీరిద్దరు ఒకరినొకరు మరచిపోలేకపోయారు. తన ప్రియురాలిని ఎలాగైనా కలుసుకోవాలని భావించిన రాబిన్స్ .. ఆమె ఫోటో, ఆ గ్రామం పేరు ఆధారంగా జెన్నీ కోసం అన్వేషించాడు.

ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించి దాదాపు 75 సంవత్సరాల తర్వాత జెన్నీని కలుసుకున్నాడు. అన్ని సంవత్సరాల తర్వాత రాబిన్స్‌ను చూడటంతో వీరిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు.

రాబిన్స్ మాట్లాడుతూ.. తాను ప్రతిక్షణం నిన్ను ఆరాధించానని.. నువ్వెప్పుడు తన గుండెల్లోనే ఉన్నావని చెప్పడంతో పాటు అతడు అపురూపంగా దాచుకున్న ఫోటోను జెన్నీకి చూపించగానే ఆమె ఆశ్చర్యానికి గురైంది.