హ్యూస్టన్: కాశ్మీర్ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది హ్యూస్టన్ లోని కాశ్మీరీ పండిట్ల బృందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరుఫున వారు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ బృందంతో కరచాలనం చేస్తుండగా అందులోని ఒక వ్యక్తి నరేంద్ర మోడీ చేతిని ఆనందంతో ముద్దాడి ఎమోషనల్ అయ్యాడు. శాంతియుతమైన, సౌభాగ్యమైన కాశ్మీర్ నిర్మాణానికి తామంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ కాశ్మీరీ పండిట్ల బృందం తెలిపింది. 

ప్రధాని మోడీకి వారు ఒక మెమోరాండాన్ని కూడా అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ పండిట్ల తోని కాశ్మీర్ అభివృద్ధి కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయమని కోరారు. ఇలా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తే ఆయా రంగాల్లో నిష్ణాతులైన కాశ్మీరీ పండిట్లంతా ఒకతాటిపైకి వచ్చి అందమైన, అభివృద్ధి బాటలో పయనించే భూతాల స్వర్గాన్ని నిర్మించడానికి వీలవుతుందని తెలిపారు. 

వీరి అభ్యర్థనకు ప్రధాని నరేంద్రమోడీ పాజిటివ్ గా స్పందించినట్టు ఆ బృందం తెలిపింది. ఈ బృందంతోని మాట్లాడడం పూర్తయిన తరువాత నమస్తే శారదా దేవి శ్లోకాన్ని కూడా పఠించారు నరేంద్ర మోడీ. 

వీరితో కలిసి మాట్లాడిన తరువాత ట్విట్టర్ వేదికగా, మీరు అనుభవించిన నరకయాతన నాకు తెలుసు. తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో మీపై జరిగిన ఊచకోతలు నాకు తెలుసు. మీరు చాలా బాధలను అనుభవించారు. ప్రపంచం చాల వేగంగా మారిపోతుంది. ఆ గాయాల నుండి బయటకొచ్చి నూతన కాశ్మీర్ ను నిర్మించుకునేందుకు కృషి చేయాలని  ప్రధాని మోడీ తెలిపారు. 

వారితోపాటు దిగిన ఫోటోను కూడా షేర్ చేసారు ప్రధాని మోడీ. ఇంకొద్ది సేపట్లో మెగా ఈవెంట్ హౌడీ మోడీ మొదలయ్యేముందు ఈ బృందం వారు వచ్చి ప్రధాని నరేంద్రమోడీ ని కలిశారు.