హమాస్ అంటే ఏమిటీ? ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్‌లో ఏం జరుగుతున్నది?
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రతరం అవుతున్నది. హమాస్ పై భారీ యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమై వేలాది సంఖ్యల సైన్యాన్ని సరిహద్దు వైపు పంపుతున్నది. యుద్ధాన్ని హమాస్ ప్రారంభిస్తే.. తాము ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్ధంలో కనీసం 1600 మంది మరణించారు. ఈ సందర్భంలోనే హమాస్, గాజా స్ట్రిప్ ఏమిటీ? వాటి ప్రాధాన్యతలను ఏమిటీ? అనే విషయాలను చూద్దాం.
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేసింది. గాజా స్ట్రిప్‌కు సమీపంలోని ఇజ్రాయెల్ పౌరుల సముదాయాల్లోకి చొచ్చుకు వెళ్లారు. వందలాది మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు.
గాజా స్ట్రిప్ అంటే ఏమిటీ:
ఇజ్రాయెల్, ఈజిప్టుల నడుమ చిన్న పట్టిలా మధ్యదరా సముద్ర తీరాన గాజా స్ట్రిప్ ఉంటుంది. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే చిన్న భూభాగమే ఈ గాజా స్ట్రిప్. ఇంతటి తక్కువ ప్రదేశంలోనే 23 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో గాజా స్ట్రిప్ ఒకటి.
గాజా ఇప్పుడు ఒంటరి. పొరుగున ఉండే ఈ రెండు దేశాలతో దానికి సత్సంబంధాలు లేవు. గాజా సముద్ర తీరంలోని జలాలు, దాని గగనతలంపైనా అధికారం ఇజ్రాయెల్‌దే. గాజా సరిహద్దులనూ ఇజ్రాయెల్ నియంత్రిస్తున్నది. ఏ సరుకులు ఈ సరిహద్దుల గుండా, సముద్ర మార్గాన వెళ్లాలో కూడా ఇజ్రాయెల్ కంట్రోల్‌లోనే ఉన్నది. 2007 నుంచి ఈజిప్టు, ఇజ్రాయెల్ కలిసి గాజా పట్టిని దిగ్బంధిస్తున్నాయి. అందుకే గాజా పట్టిన బహిరంగ కారాగారం అంటారు.
హమాస్ అంటే ఏమిటీ?
గాజా స్ట్రిప్‌ను పాలించే పాలస్తీనా సాయుధ గ్రూపే హమాస్. ఇజ్రాయెల్‌ను నాశనం చేసి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిన బూనింది. 2007లో గాజాలో అధికారంలోకి వచ్చిన తర్వాత హమాస్ ఇజ్రాయెల్‌తో చాలా సార్లు యుద్ధానికి దిగింది. చాలా సార్లు ఇజ్రాయెల్ పై రాకెట్లు ప్రయోగించి మృత్యుకేళి సృష్టించింది. ఇతర గ్రూపులు కూడా ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి ప్రోత్సహించింది. ఇజ్రాయెల్ కూడా చాలా సార్లు హమాస్ మీద వైమానిక దాడులతో విరుచుకుపడింది.
హమాస్ మొత్తాన్ని లేదా హమాస్ మిలిటరీ వింగ్‌ను చాలా దేశాలు ఉగ్రవాద గ్రూపుగా గుర్తించాయి. ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే సహా అనేక ఇతర దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయి. కాగా, మరికొన్ని దేశాలు మాత్రం వారి స్వాతంత్ర్యం కోసం పోరాడే గ్రూపుగా చూస్తుంటాయి. ముఖ్యంగా అరబ్ దేశాలు హమాస్ గ్రూపునకు సానుభూతిని చూపుతుంటాయి.
Also Read: శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ఎలా విఫలమయ్యాయి? హమాస్ ఎలా ప్లాన్ చేసింది?
పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల ఘర్షణ ఏమిటీ?
గాజా, వెస్ట్ బ్యాంక్‌లను పాలస్తీనా భూభాగాలుగా భావిస్తారు. రోమన్ కాలం నుంచీ వీటితోపాటు తూర్పు జెరూసలేం, ఇజ్రాయెల్‌ను పాలస్తీనాగానే చూశారు. బైబిల్ ప్రకారం అక్కడ యూదుల రాజ్యం కూడా ఉండేది. దీన్నే యూదులు తమ ప్రాచీన రాజ్యంగా భావిస్తారు.
1948లో ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా ప్రకటించారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించనివారు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మొత్తం పాలస్తీనాగానే భావిస్తారు. వెస్ట్ బ్యాంక్, గాజా, ఈస్ట్ జెరూసలేంను కలిపే పాలస్తీనా అని పాలస్తీనావాసులు సంభోదిస్తుంటారు.
ప్రాచీన కాలంలో ఇది ఇజ్రాయెల్ రాజ్యమేనని యూదులు భావిస్తుండగా.. అగ్రదేశం అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ క్రమంగా పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకుంటున్నదని పాలస్తీనావాసులు వాదిస్తారు. ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి క్రమంగా పాలస్తీనా దేశ భూభాగం కుచించుకుపోతుండగా ఇజ్రాయెల్ వైశాల్యం పెరుగుతున్నది.
హమాస్ ఇప్పుడే ఎందుకు దాడి చేసింది?
అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి ఎలాంటి సంకేతాలు లేకుండా జరిగింది. పాలస్తీనా అధీనంలోని వెస్ట్ బ్యాంక్‌లో నివసించే పాలస్తీనియన్లకు ఈ ఏడాది రక్తసిక్తమైనదిగా ఉన్నది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడానికి ఇది ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. సాధారణ పాలస్తీనియన్లలోనూ హమాస్ పట్ల ఆదరణ పెంచుకోవడానికి కూడా ఈ మెరుపు దాడిని ప్లాన్ చేసి ఉండొచ్చనీ వాదిస్తున్నారు.
Also Read: ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఒక్కో బాంబ్ కు ఒక్కో బందీని చంపేస్తాం: సాయుధ గ్రూపు హమాస్ వార్నింగ్
ఇజ్రాయెల్ జైళ్లలో 4,500 మంది పాలస్తీనియన్లు మగ్గుతున్నారు. ఇది పాలస్తీనియన్లకు భావోద్వేగమైన అంశం. వీరిని విడుదల చేయాలనే డిమాండ్ కోసం ఇజ్రాయెల్ పౌరులను హమాస్ భారీగా బందీలుగా చేయాలని భావించి ఉండొచ్చు.
ఇజ్రాయెల్‌కు బద్ధశత్రువైన ఇరాన్ కనుసన్నల్లోనే హమాస్ దాడి జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ యూఎన్ అంబాసిడర్ ఖండించారు. ఇరాన్ జోక్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగే అవకాశం ఉన్నది. అమెరికా ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇరాన్, హమాస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదే జరిగితే హమాస్ పై ఇజ్రాయెల్ చేసే దాడులకు అరబ్ ప్రపంచం నుంచి స్పందన, సానుభూతి కరువయ్యే ముప్పు ఉన్నదని అవి భావిస్తున్నాయి.